TS News: ప్రేమ పెళ్లి చేసుకుందని కడుపులో బిడ్డను చంపేశారు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం..
ప్రేమ వివాహం చేసుకుందున్న కారణంతో ఒక మహిళ కడుపులోని 8 నెలల శిశువును బలవంతంగా ఆపరేషన్ చేసి తొలగించిన అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది.
తరాలు మారుతోన్నా ప్రేమ వివాహం మీద అపోహలు చెరగడం లేదు. ప్రేమ వివాహం చేసుకుందున్న కారణంతో ఒక మహిళ కడుపులోని 8 నెలల శిశువును బలవంతంగా ఆపరేషన్ చేసి తొలగించిన అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో చోటుచేసుకుంది. బాధిత మహిళ తల్లి, సోదరి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సునీత (19) అదే గ్రామానికి చెందిన రవి కుమార్‌ని (23) ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. వివాహం చేసుకోవద్దని తేల్చి చెప్పారు. వారి మాటలు ఖాతరు చేయకుండా.. సునీత, రవి కుమార్ పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం సునీత 8 నెలల గర్భిణి కావడంతో విశ్రాంతి అవసరమని రవి కుమార్ భావించాడు. దీంతో ఆమెను తమ బంధువుల ఇంటి వద్ద ఉంచారు. విషయం తెలుసుకున్న సునీత తల్లి వెంకటమ్మ, అక్క సరిత ఆమెను చూడటానికి వెళ్లారు.
ఆసుపత్రిలో చెక్ చేయిస్తామని చెప్పి..
కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందో లేదో అని ఆసుపత్రిలో చెక్ చేయిస్తామని చెప్పి.. సునీతను నమ్మించి ఆమె తల్లి, సోదరి ఆటోలో తీసుకెళ్లారు. సునీత ఆసుపత్రికి వెళ్లిందన్న విషయం రవి కుమార్‌కు తెలిసింది. దీంతో ఆయనకు అనుమానం వచ్చి.. ఊర్కొండ ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత బంధువు ఒకరు కల్వకుర్తిలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తారు. అదే ఆసుపత్రికి సునీతను తీసుకెళ్లి ఉండవచ్చని రవి పోలీసులకు తెలిపాడు.
దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా.. సునీత కడుపులో బిడ్డను తొలగించిన విషయం వెలుగులోకి వచ్చింది. అబార్షన్ చేయించి సునీత కడుపులో బిడ్డను తొలగించారని పోలీసులు గుర్తించారు. ఘటనకు కారణమైన సునీత తల్లి, సోదరితో పాటు.. సునీతకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ శ్రీవాణి, దీనికి సహకరించిన నర్సు, మరో ఆరుగురు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లితో పాటు సోదరిని రిమాండ్‌కు తరలించామని పోలీసులు వెల్లడించారు. సునీతకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ శ్రీవాణితో పాటు మిగతా వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.