Kaleswaram Issue : వరదలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత నష్టం జరిగింది? ప్రభుత్వం ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతోంది ?
కాళేశ్వరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందన్న ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి. అందుకే చూడనీయడం లేదని అంటున్నారు. కానీ ఆ ఆరోపణల్ని తెలంగాణ సర్కార్ ఖండిస్తోంది.
Kaleswaram Issue : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్ అవుతోంది. దీనికి కారణం వరదల్లో ఆ ప్రాజెక్ట్ దెబ్బతిన్నదన్న ప్రచారం విస్తృతంగా జరుగుతూండటమే. ప్రభుత్వం కూడా అసలు ఎంత నష్టం జరిగిందో చెప్పడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పైగా మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఎవరైనా వెళ్తూంటే పోలీసుల్ని పెట్టి అడ్డుకుంటున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులు.. చివరికి కేంద్ర జలశక్తి మంత్రి కూడా ఈ ప్రాజెక్టులో చాలా అవినీతి జరిగిందని.. ఆరోపిస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత డ్యామేజీ జరిగింది ? ఎందుకు ప్రభుత్వం సీక్రెట్‌గా ఉంచుతోంది?
వరదలకు మునిగిన రెండు పంప్ హౌస్‌లు !
గోదావరికి వచ్చిన వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెండు పంప్ హౌస్‌లు నీట మునిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్‌లు నిర్మించారు. వీటిలో అన్నారం, కన్నెపల్లి పంప్ హౌస్‌లు మునిగిపోయాయి. కన్నెపల్లి పంప్ హౌస్‌లో బాహుబలి మోటార్లను అమర్చారు.ఈ రెండు పంప్ హౌస్‌లు నీట మునిగిన తర్వాత.. డీవాటరింగ్ చేయడానికి చాలా సమయం పట్టింది. కన్నెపల్లి నీళ్లన్నీ తోడిన తర్వాత చూస్తే మోటార్లు పూర్తి స్థాయిలో పాడైపోయినట్లుగా తేలింది. ప్రొటెక్షన్ వాల్, క్రేన్లు, లిఫ్టు కూలడంతో మోటార్లు ధ‌్వంసం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అన్నారంలో మరీ అంత తీవ్రం కాకపోయినా మోటార్లు దెబ్బతిన్నాయి. వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగిన నష్టం ఇదే. అంటే.. రెండు పంప్ హౌస్‌లలో మోటార్లకు జరిగిన నష్టం..పంప్ హౌస్‌లలో సామాగ్రికి జరిగిన నష్టం మాత్రేమ. ఇది కేవలం రూ. ఇరవై కోట్లేనని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎంత నష్టమైనా .. కాంట్రాక్ట్ సంస్థనే పెట్టుకుంటుందని ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందని విపక్షాలు విమర్శలు!
కాళేశ్వరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరిగిందని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. రూ. లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్ట్ నిరుపయోగమని.. అనుమతులు లేవని .. కేసీఆర్ కమిషన్ల కోసమే కట్టారన్న ఆరోపణలను ఇప్పుడు బీజేపీ వైపు నుంచి తీవ్రంగా వస్తున్నాయి. తెలంగాణ నేతలు ఎప్పట్నుంచో ఈ ఆరోపణలు చేస్తున్నారు. కానీ కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ స్వయంగా ఇప్పుడు కాళేశ్వరం గురించి చెబుతున్నారు. అదో దండగమారి ప్రాజెక్ట్ అని చెప్పడం ప్రారంభించారు. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని … అందుకే వరదలకు కొట్టుకుపోయిందని అంటున్నారు. అయితే బీజేపీ నేతలదంతా డ్రామా అని… కేంద్రం చేతిలో అధికారం ఉండి..కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ చేయించరని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. అలాగే టీఆర్ఎస్ కూడా అనుమతులు.. అప్పులు కూడా ఇచ్చింది కేంద్రమే కదా అని. మండిపడుతోంది. కాళేశ్వరంలో అవినీతి అని బీజేపీ విమర్శిస్తూంటే.. మీ వల్లేనని కాంగ్రెస్ బీజేపీని అంటోంది.
గట్టిగా కౌంటర్ ఇస్తున్న టీఆర్ఎస్ !
కాళేశ్వరంలో అవినీతి అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీఆర్ఎస్ గట్టిగా ఖండిస్తోంది. అసలు కాళేశ్వరం గురించి తెలియకుండా... ప్రాజెక్టు కొట్టుకుపోయిందని అంటున్నారని మండిపడ్డారు. రెండు పంప్ హౌస్‌లలో మాత్రమే నీరు చేరిందని..నెలన్నరలో వాటిని బాగు చేయించి నీళ్లు ఇస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. మరో వైపు అసలు కాళేశ్వరంకు అనుమతులు.. అప్పులు ఇచ్చింది బీజేపీనే కదా అని.. ప్రశ్నిస్తున్నారు. అప్పుడు లేని అవినతి ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
ఎంత వరద వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి నష్టం ఉండదు !
కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ఒక్కచోట ఉండేది కాదు. కాళేశ్వరలో భాగంగా గోదావరిపై మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద బ్యారేజ్‌లు కట్టారు. ఒక బ్యారేజ్‌లో నిల్వ ఉన్న నీటిని పంపుహౌజు నుంచి తోడి కాలువ ద్వారా మరో బ్యారేజ్ ముందుకు వదిలేలా ఏర్పాటు ఉంటుంది. గోదావరి ప్రవాహానికి వ్యతిరేక దిశలో, ఎగువకి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకూ నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా నీటిని పంపిస్తారు. కొత్త బ్యారేజీల వల్ల గోదావరిలో దాదాపు 150 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీరుంటుంది. నీరు సొరంగాలు, కాలువల్లో ప్రవహించి, పంపుహౌజుల్లో లిఫ్టు చేసి భూమి లోపల, బయట ప్రయాణించి వేర్వేరు కొత్త, పాత జలాశయాలను కలుపుతూ దక్షిణ తెలంగాణ వరకూ వస్తుంది. అంటే ప్రాజెక్టు సుదీర్ఘంగా ఉంటుంది. అందు వల్ల మోటార్లకు.. పంపులకే జరిగే నష్టం తప్ప.. ఇతర నష్టం ఉండదని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు .