Nizamabad News: కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభం ఎప్పుడు?
భవనం పూర్తై నెలలు గడుస్తోంది. ఇంకా కొత్త బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు కలెక్టరేట్ సిబ్బందికి మంచి సమయం దొరకడం లేదు. కొత్త భవనం వృథా అవుతుండగా... ప్రైవేటు బిల్డింగ్‌కు లక్షలు కడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తయి 8 నెలలు కావస్తోంది. ఇంకా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించలేదు. భవనం పూర్తయినా నేటికీ అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతున్నాయ్. లక్షల్లో అద్దెలు కడుతున్నారు. నిజామాబాద్ నగరంలోని ఖానాపూర్ సమీపంలోని బైపాస్ రోడ్డులో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని 2017 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్ నిర్మాణానికి 58.7 కోట్ల రూపాయలను వెచ్చించారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లతోపాటు మొత్తం 14 శాఖల ఆఫీసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ 34, ఫస్ట్ ప్లోర్ 23, సెంకడ్ ఫ్లోర్లో 28 రూమ్స్ వివిధ శాఖలకు కేటాయించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బిల్డింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. ఏడాది జూన్ 20న సీఎం రాక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ సీఎం టూర్ క్యాన్సిల్ అయ్యింది. సెప్టెంబర్ లో సీఎం టూర్ ఖరారు చేసినా చివరి క్షణంలో వాయిదా పడింది. ఎమ్మెల్సీగా రెండోసారి కవిత ప్రమాణం చేసిన తర్వాత కలెక్టరేట్ ప్రారంభిస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. కాని ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. జిల్లా కేంద్రంలో దాదాపు పది ప్రభుత్వ శాఖల ఆఫీసులను ప్రైవేట్ బిల్డింగుల్లో నిర్వహిస్తున్నారు. వీటికి లక్షల్లో కిరాయిలు చెల్లిస్తున్నారు. కలెక్టరేట్ ప్రారంభమైనా ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. అయితే ప్రారంభానికి ముందే కొత్త కలెక్టరేట్ కు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయ్. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కలెక్టరేట్ లో భారీగా వరద నీరు చేరింది. కలెక్టరేట్ లోతట్టు ప్రాంతంలో నిర్మించటం వల్ల నీరు నీలుస్తోంది ఇది పెద్ద సమస్యకాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు.
మరీ ఎందుకింత లేట్?
కొత్త కలెక్టరేట్ భవనం పూర్తయి 8 నెలలు కావస్తున్నా.... ఎందుకు ప్రారంభానికి నోచుకోవటం లేదన్నదానిపై చర్చ జరుగుతోంది. జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పటికీ తరచూ సీఎం కేసీఆర్ టూర్ రద్దు కావటం వెనక కారణం ఏంటన్నదానిపై చర్చించుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా కవిత రెండో సారి ఎన్నిక అయ్యారు. అయితే కవితకు మంత్రి పదవి వచ్చాక కలెక్టరేట్ ప్రారంభ కార్యక్రమం ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయ్. టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే ఈ చర్చ జోరుగా జరుగుతోంది. ఏదైమైనా పూర్తయిన కలెక్టరేట్ ను ప్రారంభించకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.
Also Read: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా