Balayya on KCR: సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన బాలయ్య.. ఆ పని అద్భుతమని ప్రశంసలు
గత కొద్ది రోజులుగా అఖండ చిత్ర టీమ్ తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తోంది. తాజాగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని వారు దర్శించుకున్నారు.
‘అఖండ’ సినిమా విజయంతో సినీ పరిశ్రమకు మంచి ఉత్సాహం వచ్చినట్లయింది. గత కొద్ది రోజులుగా చిత్ర టీమ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ వస్తోంది. విజయవాడ కనకదుర్గమ్మ, మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి, పెదకాకాని శివాలయం, శ్రీకాళహస్తి, తిరుపతిలోని పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తాజాగా అఖండ టీమ్ యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తదితరులు సోమవారం ఉదయం యాదాద్రి గుడికి వచ్చారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపల బాలయ్య మీడియాతో మాట్లాడారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కేసీఆర్ చూపిన ప్రత్యేక చొరవ ప్రశంసనీయమని అన్నారు. భక్తులు కూడా ఆలయ విశిష్టతను, స్వచ్ఛతను సంరక్షించాలని కోరారు. దేశంలోని ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి దర్శనం చేసుకొనేలా ఆలయాన్ని తీర్చిదిద్దారని కొనియాడారు. ఈ ఆలయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడి పరిసరాలను కలుషితం కాకుండా జాగ్రత్త వహించాలి. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని స్వామివారిని కోరుకున్నాను. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అని ఈ సందర్భంగా బాలయ్య పేర్కొన్నారు.
అంతకుముందు, యాదాద్రికి వచ్చిన బాలయ్యకు దేవస్థానం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు.
‘‘నా ఇష్ట దైవం కూడా లక్ష్మీ నరసింహస్వామి. నాపై స్వామివారి అనుగ్రహం ఉంది. నా సినిమాలు, వాటి పేర్లలో కూడా ఎక్కువగా నరసింహ స్వామికి ప్రత్యేక పాత్ర ఉంది. నా చిన్నప్పటి నుంచి ఈ ఆలయానికి వస్తున్నా. ఇప్పుడు ఈ ఆలయం ఎంతో మార్పు చెందింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఈ ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగింది. ఈ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న చిత్రకారులు, స్తపతులు, కూలీలు అందరికీ ధన్యవాదాలు.’’ అని బాలకృష్ణ అన్నారు.
Also Read: రేవంత్ హౌస్ అరెస్టు.. అన్ని దారులు మూసేసిన పోలీసులు.. ‘కేసీఆర్‌కి ఎందుకీ భయం’ అంటూ ట్వీట్
Also Read: PM Modi Mann ki Baat: మోదీ నోట తెలంగాణ వ్యక్తి పేరు.. మన్ కీ బాత్‌లో ప్రత్యేక ఆకర్షణ, ఎందుకో తెలుసా?
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా