Tiger In Adilabad: ఆదిలాబాద్ జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్న పులులు.. గ్రామాల్లో డప్పు చాటింపు
Adilabad Tiger News | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోనీ రాసపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచారంపై డప్పు చాటింపు వేశారు.

Tiger Strays Into Adilabad Border Village | కాగజ్ నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారం భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల బోథ్ మండలంలో గత రెండు నెలలుగా పులి సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. తాజాగా గాదిగూడ మండలంలోనీ కడోడి గ్రామ సమీపంలోని లొద్దిలో నాలుగు లెగదూడలపై పులి దాడి చేసింది. ఇందులో మూడు చనిపోగా, ఒక లేగదూడ కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు గమనించి గ్రామస్తులకు సమాచారం చేయడంతో అక్కడికి చేరుకుని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించి పులి దాడిలో హతమైన లేగ దూడలను కోన ఊపిరితో ఉన్న లేగ దూడను పరిశీలించారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి
కొండసరిహద్దు వద్ద గల లొద్దిలో పులి దాడి చేయడంతో తెలంగాణ అటవీ శాఖ పరిధి ముగించుకొని అవతలి వైపు మహారాష్ట్ర సరిహద్దు జీవిత తాలూకా పరిధిలో ఉందని, అక్కడి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో మహారాష్ట్రలోని జీవిత తాలూకా అటవీశాఖ అధికారులు తెలంగాణ ఉట్నూర్ రేంజ్ అధికారులు సమన్వయంతో కలిసి పరిస్థితిని సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తూ పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పులి తెలంగాణ వైపు లేదా మళ్లీ తిరిగి మహారాష్ట్ర వైపు వెళ్లే అవకాశం ఉందని కనుక సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరికైన పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు.

పులి అడుగుజాడలు గుర్తింపు
ఈ విషయమై ఉట్నూర్ రేంజ్ అధికారి శిలానంద్ తో abp దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. కడోడి లొద్ది ప్రాంతంలో పులి సంచారం వాస్తవమేనని అక్కడ నాలుగు దూడలపై దాడి చేసి దాడి చేససిందన్నారు. కానీ ఆ ఆటవి పరిధి తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతం పరిధిలోకి వస్తుందన్నారు. మహారాష్ట్ర జీవిత తాలూకా ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఇరువురి సమన్వయంతో కలిసి పులి అడుగుజాడలను కనిపెడుతూ సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. పులి ఏ క్షణమైనా మహారాష్ట్ర వైపు లేదా తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని, సరిహద్దు గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.

మరొపక్కా అటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ కారిడార్ పరిధిలోని పెంచికల్ పేట్, దహెగాం, కాగజ్ నగర్ సరిహద్దుల్లో గల రాసపల్లి అటవీ ప్రాంతాల్లో పులులు తిరుగుతున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. కుమ్రం భీం, మంచిర్యాల జిల్లాల సరిహద్దు మండలాల్లోనూ పులులు సంచరిస్తున్నాయి. ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లొద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు. సమీప గ్రామాల్లోను డప్పు చాటింపు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయమై కాగజ్ నగర్ అటవీ రేంజ్ అధికారి అనిల్ కుమార్ తో abp దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా... పులి సంచారం వాస్తవమేనన్నారు.

గత కొద్ది రోజులుగా పులి పెంచికల్ పేట్ అటవీ ప్రాంతం మీదుగా కాగజ్ నగర్ అటవీ ప్రాంతం వైపు సంచరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు సరిహద్దులో ఉన్న వ్యవసాయ రైతులకు కూలీలకు పులి సంచారం గురించి అవగాహన కల్పిస్తూ అప్రమత్తంగా ఉండాలని, డప్పు చాటింపు సైతం నిర్వహిస్తూ సూచించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం పులులకు మేటింగ్ సీజన్ ప్రారంభమైందని, మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా అభయారణ్యాల నుండి అటవీ సరిహద్దు ప్రాంతం మీదుగా తెలంగాణలోని ఆదిలాబాద్ బఫర్ ఏరియా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ కారిడార్ ప్రాంతాల్లోకి సంచరిస్తూ.. వస్తు పోతూ ఉంటాయన్నారు. పులులు వస్తువు పోయే క్రమంలో వాటికి ఎలాంటి హాని చేయకుండా ఉండాలని, ప్రజలు సైతం జాగ్రత్తగా ఉండేలా అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారన్నారు.
ఆసిఫాబాద్ డి.ఎఫ్.ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ సైతం ఈ విషయంలో ప్రజలకు అవగాహన కలిగించేలా అటవీ శాఖ అధికారులకు సైతం సూచనలు జారీ చేయడం జరిగింది. పులుల రాక ఆసన్నమైన ఈ మేటింగ్ సీజన్ లో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని పులులను సంరక్షిస్తూ అడవులను సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు.





















