Adilabad Crime News: న్యూడ్ ఫోటోలు, వీడియోలతో విద్యార్థినులను బ్లాక్ మెయిల్.. ఆదిలాబాద్ లో ఇద్దరి అరెస్టు
Telangana Crime News | చదువుకునే అమ్మాయిలను టార్గెట్ చేసుకుని, అశ్లీల ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఇద్దరు యువకులనరు ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Adilabad Crime News: ఆదిలాబాద్ జిల్లాలో అమ్మాయిలతో పాటు మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి లైంగిక వేదింపులతో వికృతానందం పొందుతున్న ముఠా రాకెట్ ను పోలీసులు చేదించారు. ఆదిలాబాద్ జిల్లాలోని మావల పోలీసుస్టేషన్ లో ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మావల పోలీసులు షేక్ సల్మాన్, ఇమ్రాన్ ఖాన్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి వెల్లడించారు.
న్యూడ్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కొంతకాలంగా కొంత మంది పోకిరీలు చదువుకుంటున్న అమ్మాయిలతోపాటు మైనర్ బాలికలను ప్రేమ పేరుతో లొంగదీసుకుని, ఆ తర్వాత సెల్ ఫోన్ల ద్వారా న్యూడ్ ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగు పాల్పడుతున్నారు. కొంత మందిని మాయమాటలతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగికంగా లొంగదీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మావల పోలీసుస్టేషన్ పరిధిలోని షేక్ సల్మాన్, ఇమ్రాన్ ఖాన్ అనే ఇద్దరు నిందితులు కలిసి ఓ యువతిని లొంగదీసుకునీ గాంధీ పార్కులో బర్త్ డే పేరుతో సెల్ఫీలు తీసుకుని, లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. తొలుత సల్మాన్ ప్రేమ పేరుతో ప్రస్తావన తీసుకురాగా, ఆమె అందుకు నిరాకరించడంతో ఇంతకు ముందు తీసుకున్న అశ్లీల ఫోటోలు తన వద్ద ఉన్నాయని, తన మాట వినకపోతే బయటపెడతానని హెచ్చరించారు.

ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు
ప్రతీ రోజు ఫోన్ కాల్స్ మానసిక వేదింపులకు గురిచేయడంతో పాటు ఇటీవల టీచర్స్ కాలనీలోని దస్నాపూర్ ఎం.ఎస్ బేకరి వద్ద కలవాలని, కలవకపోతే ఫోటోలు బయటపెడుతానని బెదిరించాడు. పోలీసులను ఆశ్రయించడంతో ఈ మేరకు మావల పోలీసుస్టేషన్ లో బాధితురాలీ ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులు షేక్ సల్మాన్, ఇమ్రాన్ ఖాన్లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పిల్లల విషయంలోను తల్లిదండ్రులు సైతం జాగ్రత్తలు తీసుకోవాలని డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి వివరించారు. వివిధ ప్రాంతాల నుండి చదువుకునేందుకు ఆదిలాబాద్ కు వచ్చే అమ్మాయిలు అపరిచిత వ్యక్తుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, తల్లిదండ్రులు సైతం పిల్లల సెల్ ఫోన్ సంభాషణపై ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని డీఎస్పీ కోరారు.






















