Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు లేవు, కానీ అనుమానాలు ఉన్నాయన్న ఈఎస్సీ మురళీదరన్
మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవని, కానీ ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని అనుమానించారని నీటి పారుదల శాఖ జనరల్ ఈఎన్సీ మురళీధరన్ అన్నారు.
![Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు లేవు, కానీ అనుమానాలు ఉన్నాయన్న ఈఎస్సీ మురళీదరన్ There are no faults in the construction of Medigadda dam, but there are suspicions on work ESC Muralidharan Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలు లేవు, కానీ అనుమానాలు ఉన్నాయన్న ఈఎస్సీ మురళీదరన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/25/4892d95a3a14b3f6a3c86ac09cc5dfac1698234921404801_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Medigadda Barrage:
మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవని, కానీ ఎక్కడో చిన్న పొరపాటు అయితే జరిగిందని అనుమానించారని నీటి పారుదల శాఖ జనరల్ ఈఎన్సీ మురళీధరన్ అన్నారు. మేడిగడ్డ ఆనకట్ట అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమావేశమైంది. కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ జలసౌధలో ఇంజినీర్లతో సమావేశమైంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏడో బ్లాక్లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగిందని అన్నారు. ఇసుక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు. క్వాలిటీ ఆఫ్ సాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయన్నారు. కాపర్ డ్యామ్కు వరద తగ్గాక నవంబరు చివరలో సమగ్ర పరిశీలన జరుపుతామని ఈఎన్సీ మురళీధరన్ తెలిపారు.
భారీ శబ్దంతో శనివారం రాత్రి మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం కలకలం రేపింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగిన విషయం తెలిసిందే. బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు.
ఆనకట్ట కుంగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇంజినీర్ల కమిటీ.. మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. ఇవాళ(బుధవారం) హైదరాబాద్లో రాష్ట్ర ఇంజినీర్లతో సమావేశమయ్యారు. ఆనకట్టకు సంబంధించిన నిర్మాణ ప్రక్రియ, తీసుకున్న జాగ్రత్తలు, సాంకేతిక అంశాలు, కుంగిపోవడానికి గల కారణాలు సహా అనేక అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయి పరిశీలన, ఇంజినీర్ల సమావేశం ఆధారంగా కేంద్ర బృందం నివేదిక సమర్పించనుంది.
ఆరుగురు సభ్యుల బృందం పరిశీలన
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును క్షేత్రస్థాయిలో పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, ఎల్ అండ్ టీ ప్రతినిధులు.. కేంద్ర బృందంతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుంగుబాటు వల్ల ఏర్పడిన నష్టం, బ్యారేజీ పటిష్ఠత తదితర అంశాలను కమిటీ సభ్యులు కూలంకశంగా తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతపై విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ.. కమిటీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ(Medigadda Lakshmi Barrage)పై వంతెనను కేంద్ర బృందం సందర్శించింది. మేడిగడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర జల్ శక్తి శాఖ.. ఆగమేఘాల మీద ఆరుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృతంలోని ఈ ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డకు వచ్చి వంతెన కుంగుబాటును ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు ఈఎన్సీ, ఈఈ ఇతర అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులు.. దిల్లీ నుంచి వచ్చిన అధికారులకు కుంగుబాటుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించారు. నిపుణుల బృందం బ్యారేజీని పరిశీలించి కుంగుబాటు ఏ మేరకు జరిగిందనే విషయంపై అవగాహనకు వచ్చారు. పగుళ్లు వల్ల వంతెన పటిష్ఠత తదితర అంశాలపై వివరాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందచేయనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)