Basara IIIT: ఆదివారం గవర్నర్ వెళ్లారు - సోమవారం నుంచి కరెంట్ కట్, అంధకారంలోనే బాసర ట్రిపుల్ ఐటీ
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. మొన్నే రాష్ట్ర గవర్నర్ విద్యార్థుల సమస్యల వినగా.. తాజాగా నిన్న మధ్యాహ్నం నుండి ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సమస్య తలెత్తింది.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ కొన్ని రోజుల నుంచి ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు వర్సిటీ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ రోజుల తరబడి విద్యార్థులు నిరసన చేయగా.. సమస్యలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. రోజూ ఏదో ఒక సమస్యపై వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో సమస్యతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సోమవారం మధ్యహ్నాం 12 గంటల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
క్యాంటీన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్లు..
కరెంటు లేక, రోజంతా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. క్యాంటీన్ లో క్యాండిల్స్ పెట్టుకుని అదే వెలుతురు మధ్యలో విద్యార్థులు భోజనం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. పగలు 12 గంటలకు పోయిన కరెంటు అర్ధరాత్రి అయినా రాలేదు. రోజు దాటినా విద్యుత్ సరఫరా లేకపోవడం విద్యార్థులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది. ట్రాన్స్ ఫార్మర్ వద్ద సమస్య ఉందని అధికారులు చెప్పారు. సోమవారం అర్ధరాత్రి లోపు కరెంటు సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు. కానీ విద్యుత్ సరఫరా ఇంకా పునరుద్ధరించలేదు. అయితే క్యాంపస్ లో భారీ సోలార్ ప్లాంట్ ఉన్నప్పటికీ అది నిరుపయోగంగా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
గవర్నర్ వెళ్లి వచ్చిన మరుసటి రోజే మరో సమస్య
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారం రోజు బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్కడి విద్యార్థులతో క్యాంపస్, వారి సమస్యలపై చర్చించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తమిళిసై.. విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్ గా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాల్సిందిగా అధికారులకు సూచించారు. అమ్మాయిల భద్రత విషయలో సమస్య ఉన్నట్లు తెలిసిందని.. సిబ్బంది కొరతా తీరుస్తామని... ఇవాళ్టి నుంచి ఒక్కొక్క సమస్య తీరుతుందన్న నమ్మకం ఉందని తెలిపారు. అయితే గవర్నర్ ఆదివారం క్యాంపస్‌కు వెళ్లగా.. మరుసటి రోజు నుంచి మరో సమస్య విద్యార్థులను వేధించడం ప్రారంభించింది.
మాటిచ్చి నిలబెట్టుకున్న గవర్నర్..
ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యలపై ఇటీవలే గవర్నర్ తమిళి సై ని కలిశారు. ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. చాలా రోజుల నుంచి తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని గవర్నర్ కు చెప్పారు. వాటిని పరిష్కరించాలని ఆందోళన చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేవని గవర్నర్ కు వెల్లడించారు. ఈ సందర్భంగా బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి రావాలని విద్యార్థులు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కోరారు. విద్యార్థుల కోరిక మేరకు తప్పకుండా ట్రిపుట్ ఐటీకి వచ్చి సమస్యలను పరిశీలిస్తానని ఆనాడు గవర్నర్ మాట ఇచ్చారు. తప్పకుండా వస్తానని హామీ మేరకు గవర్నర్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ కి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.
కరెంటు కోతలపై ఆగ్రహం..
బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో కరెంటు కోతలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో చదువులు సాగించేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కరెంటు లేకపోవడంతో సెల్ ఫోన్ వెలుతురులోనే రాత్రంతా గడిపామని, ఆహారం తినేందుకు క్యాండిల్ వినియోగించామని వాపోతున్నారు. విద్యార్థుల వసతి గృహాలు అంధకారంలోనే ఉన్నాయని, తమ సమస్యలు త్వరగా తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.