అన్వేషించండి
Advertisement
Nizamabad News: రెండో విడత దళిత బందుపై నిజామాబాద్‌లో ఒకటే లొల్లి
రెండో విడత ఎంపిక ప్రక్రియ మొదలుకాకముందే బేరసారాలు. దళిత బంధు కోసం జోరందుకున్న పైరవీలు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి నిజామాబాద్ జిల్లాలో పైరవీలు ఊపందుకున్నాయని సమాచారం. రెండో విడత దళిత బంధుకు ఇంకా గైడ్‌లైన్స్ విడుదల కాకముందే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయట. నియోజకవర్గానికి పదిహేను వందల యూనిట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించటంతో ఎక్కువమంది అవకాశం కోసం చూస్తున్నారు. ఎవరికివారే సిఫార్సులు
చేయించుకుంటూ అవకాశం కల్పించాలని కోరుతున్నారట. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నేతల ద్వారా ఎమ్మెల్యేలను కలుస్తూ పైరవీలు షూరు చేశారని జిల్లాలో టాక్ నడుస్తోంది. ఇదే ఆసరాగా కొంతమంది కిందిస్థాయి నేతలు రింగ్‌గా ఏర్పడి పైరవీలకు తెర తీస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు రూ.లక్ష నుంచి 2లక్షల వరకు ఇస్తే దళితబంధు మంజూరు చేయిస్తామని ఆశ చూపుతున్నారుని ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రాసెసింగ్ పేరిట కొంత డబ్బులను వసూలు చేస్తున్నారట మరి.
నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత నియోజకవర్గానికి వంద చొప్పున దళితబంధు యూనిట్లు మంజూరు చేశారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దళితబంధు లబ్ధిదారులను ఎంపిక చేశారు. నిధులు జిల్లాకు రూ.55కోట్లు మంజూరు అయ్యాయ్. ఆరు నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన లబ్ధిదారులకు వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను మంజూరు చేశారు.
మొదటి విడత దళితబంధు పూర్తికావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత కింద నియోజకవర్గానికి 1500 చొప్పున యూనిట్లను ప్రభుత్వం దళిత బంధును మంజూరు చేసింది. రెండో విడతలో తొలిదశలో నియోజకవర్గంలో 500 మంది చొప్పున ఎంపిక చేసేందుకు సిద్ధమవుతోంది. దళితబంధు కింద ఎంపికైన వారికి ఉన్న శిక్షణ ఆధారంగా ఆయా యూనిట్లలో మరింత శాస్త్రీయమైన శిక్షణను అందించడంతోపాటు యూనిట్లను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదిగేవిధంగా ప్రోత్సహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో విడత కింద భారీగా ఎంపికయ్యే అవకాశం ఉండడం, ఆరు నియోజకవర్గాల పరిధిలో రూ.825 కోట్ల వరకు ఈ పథకం కింద నిధులు వచ్చే అవకాశం ఉండడంతో సక్రమంగా వినియోగించుకునే విధంగా జిల్లా యంత్రాంగం ప్రయత్నిస్తోంది.
నియోజకవర్గాని కి 1500 యూనిట్ల చొప్పున..
దళితబంధు కింద ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు నియోజకవర్గానికి 1500 యూనిట్ల చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉండడంతో గ్రామీణ ప్రాంతంలోని ఎక్కువమంది దళితులు ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామాల వారీగా తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పథకం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా గైడ్‌లైన్స్ విడుదల కాగానే లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
ఇదే అదునుగా తీసుకుని అధికార పార్టీకి చెందిన కిందిస్థాయి నేతలు పైరవీలకు తెరతీశారన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. రెండో విడత గైడ్‌లైన్స్ పూర్తికాగానే ఆ సిఫారసులను ఎమ్మెల్యేలకు ఇచ్చి మంజూరు చేయిస్తామని నమ్మబలుకుతున్నారట. రెండో విడత అర్హుల ఎంపిక ఏ క్షణమైనా ప్రారంభం అవుతుందని ప్రచారం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేల అనుచరులు బేరసారాలు మొదలుపెట్టారని టాక్. మొదటి విడతలో తాము చెప్పిన వారికే లిస్ట్‌లో పేరు దక్కిందని చెప్పి రెండో విడత ఎంపిక ప్రక్రియ ప్రారంభమవకముందే వసూళ్లకు తెరతీస్తున్నారని లొల్లి చేస్తున్నారు జనం.
రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందుతుందనే ఆశతో కొందరు అడిగిన మొత్తం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట. దళితబంధుకు కింద లబ్ధిదారుల ఎంపిక అయితే రూ. 10లక్షలు వచ్చే అవకాశం ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో కొంతమంది దీనికి మొగ్గుచూపుతున్నారని టాక్ ఆఫ్‌ది టౌన్ ముచ్చట.
మంజూరైన తర్వాత డబ్బులు ఇచ్చేలా ఒప్పందాలు
దళితబంధు మంజూరైన తర్వాత డబ్బులు ఇచ్చేవిధంగా ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారని మరో సమాచారం. కొన్ని ప్రాంతాల్లో కాగితాలను కూడా తమకు దగ్గరగా ఉన్న వ్యక్తుల ద్వారా రాయించుకుంటున్నారట. దళితబంధు కింద ఎంపికయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేసే అవకాశం ఉండడం, ఆయా గ్రామాల్లో కొంతమందిని తప్పనిసరిగా ఎంపికచేయనుండడంతో ఇదే అదనుగా కిందిస్థాయి నేతలు ఈ పైరవీలకు తెరలేపారని తెలుస్తోంది. పైస్థాయి నేతలకు తెలియకుండానే ఈ ఒప్పందాలను కొనసాగిస్తున్నారట. దళితబంధు ఎంపిక కింద అధికారుల ప్రమేయం తక్కువగా ఉండడం, రాజకీయ నేతలే ఎంపిక చేస్తుండడంతో గ్రామీణస్థాయిలో వారు కొంతమంది ఈ దందాకు తెర లేపుతున్నారట టాక్. రెండో విడతపై ఆశ పెట్టుకున్న దళితులతో ఎమ్మెల్యేల అనుచరులు బేరసారాలు జరుపుతున్నారట.
ప్రభుత్వం కోట్ల రూపాయలు ఈ దళితబంధు కింద ఖర్చుచేస్తున్నందున నిబంధనలు కూడా కఠినతరం చేసి ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో ఎంపికలు నిర్వహిస్తే పారదర్శకంగా జరిగే అవకాశం ఉందని మరికొందరి వాదన. ఇప్పటికే కొంతమంది గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రజావాణికి వచ్చి దళితబంధు మంజూరు చేయాలని కొన్ని నెలలుగా అధికారులకు దరఖాస్తు చేస్తున్నారు. దళితబంధు రెండో విడత మంజూరుకు ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్ వెలువడే ఈ సమయంలో ఎమ్మెల్యేలు కూడా పైరవీలపై దృష్టిసారించి గ్రామీణ ప్రాంతంలో అర్హులైన వారిని ఎంపిక చేస్తే వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉందంటున్నారు.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై కిందిస్థాయి నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని మరో ముచ్చట చక్కర్లు కొడుతోంది. దళిత బంధు పథకానికి తాము సూచించిన వారికే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారని తెలుస్తోంది. దళితబంధు ఇప్పించిన వారు లక్షా నుంచి రెండు లక్షలు వసూల్ చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయ్. దీంతో అసలైన లబ్ధిదారులు మోసపోతున్నారని వాపోతున్నారు. దళిత బంధు పథకంలో పైరవీలకు తావివ్వకుండా ... చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చి ఎలాంటి అవకతవకలు లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion