Mancherial Crime News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మృతి
Adilabad Crime News | అమెరికాలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబంలో విషాదం నింపింది. తల్లీకుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

Mancherial Crime News | ఆదిలాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన తల్లి, కూతురు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనికి చెందిన ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదం నింపింది. . అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన రమాదేవి (55), ఆమె కుమార్తె తేజస్వి (30) దుర్మరణం పాలయ్యారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన పి. విఘ్నేష్ సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. విఘ్నేష్, రమాదేవి దంపతులకు స్రవంతి, తేజస్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిద్దరూ వివాహాలు అయ్యాక అమెరికాలో స్థిరపడ్డారు. కుమార్తె తేజస్వి గృహప్రవేశం సందర్భంగా విఘ్నేష్, రమాదేవి దంపతులు గత నెల 18న అమెరికా వెళ్లారు.
శుక్రవారం నాడు (అక్టోబర్ 17) పెద్ద కుమార్తె కుమారుడు నిశాంత్ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబమంతా కలిసి కారులో ప్రయాణించింది. శనివారం తిరుగు ప్రయాణంలో వారి కారును ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి రమాదేవి, కూతురు తేజస్వి అక్కడికక్కడే మృతిచెందారు. ఇతర కుటుంబ సభ్యులకు సైతం గాయాలయ్యాయని సమాచారం.






















