Adilabad Latest News: ప్రజలు తిరుగుబాటు చేస్తే బాధ్యత మాది కాదు- ఖానాపూర్ ఎమ్మెల్యే హెచ్చరిక
Adilabad Latest News: అటవీశాఖాధికారులపై ఖానాపూర్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అటవీ అధికారులపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఫైర్ అయ్యారు. కనీస సౌకర్యాల, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తే దాన్ని చెడగొట్టేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పోడు భూముల సాగును అడ్డుకొని అడవి బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మారుమూల ప్రాంతాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న అటవీ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు వెడ్మ. ఆదివాసీలపై, గిరిజనేతరులపై దౌర్జన్యాలకు పాల్పడితే, తిరుగుబాటు చేస్తే తమది బాధ్యత కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ... తన నియోజకవర్గ పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపడుతుందన్నారు. అంతే కాకుండా పోడు భూముల సాగును అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేటీఆర్, ఎఫ్డీపీటీ శాంతరాం, ఉట్నూర్ ఎఫ్డీఓ రేవంత్ చంద్ర, సిబ్బందితో కలసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్నో ఏళ్లుగా అడవిని నమ్ముకొని జీవనం సాగించే ఆదివాసి గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములు, గిరిజనేతరుల నుంచి బలవంతంగా భూములను లాక్కొని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు వెడ్మ. ఇటీవల హైదరాబాద్‌లో జిల్లా ఇన్చార్జీ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పీసీసీఎఫ్ సువర్ణ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఫారెస్ట్ ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో అభివృద్ధి, పోడు భూముల సాగుపై సహకరించాలని, ఇతర సమస్యలపై వివరించినప్పటికీ, సదరు అధికారులు విని విననట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో లేని అడ్డంకులు ఇప్పుడు ఎలా వచ్చాయో అధికారులకు తెలియదానని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు.. ప్రభుత్వ పనులు అడ్డుకోవడమే కాకుండా, ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర చేస్తున్నారనీ అన్నారు. వీరిపై ప్రభుత్వం వెంటనే లీగల్ యాక్షన్ తీసుకొని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా అటవీ అధికారులు ప్రవర్తన మార్చుకోవాలని, ఆదివాసీలపై, గిరిజనేతరులపై దౌర్జన్యాలకు పాల్పడితే, వారు తిరుగుబాటు చేస్తే బాధ్యత తమది కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వెడ్మ. నియోజకవర్గ పరిధిలో కవ్వాల్ టైగర్ జోన్‌లో ఉన్న ఫారెస్ట్ చెక్‌పోస్ట్‌లను ఎత్తివేసి, ఆదివారం అడవి పంది దాడిలో మృతి చెందిన కొడప లక్ష్మణ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కుటుంబాన్ని ఫారెస్ట్ అధికారులు ఆదుకోవాలని డిమాండ్ చేశారు.





















