Bandi Sanjay - Kavitha: నిజామాబాద్‌లో ఆసక్తికర సీన్! ఆత్మీయంగా పలకరించుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత
అసలే ఢిల్లీ లిక్కర్ కేసులో తరచూ ఈ మధ్య బండి సంజయ్ కల్వకుంట్ల కవితను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా వీరు ఒకరినొకరు పలకరించుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

Kavitha Bandi Sanjay Meet: నిజామాబాద్‌లో ఎవరూ ఊహించని ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే నేతలు ఎదురుపడి పలకరించుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరినొకరు పలకరించుకున్నారు. అసలే ఢిల్లీ లిక్కర్ కేసులో తరచూ ఈ మధ్య బండి సంజయ్ కల్వకుంట్ల కవితను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. తాజాగా వీరు ఒకరినొకరు పలకరించుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేష్‌తోపాటు బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బండి సంజయ్‌కు పరిచయం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య గృహప్రవేశం కార్యక్రమం సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.
అనంతరం కవిత నిజామాబాద్‌లో జరిగిన హరిద రచయితల సంఘం 5వ మహాసభలో పాల్గొని ప్రసంగించారు. సమాజహితం కోసం కలాన్ని విదిల్చడమే కాకుండా జూలు కూడా విదిల్చాలని రచయితలకు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సమాజహితం కోసం పనిచేసే సాహిత్యం రావాలని ఆకాంక్షించారు. దాశరథి, వట్టికోట అళ్వారుస్వామిని నిజాం కాలంలో నిజామాబాద్ జైలులో బంధించారని, ఆ జైలు గోడ మీద దాశరధి బొగ్గుతో రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అనే మాట యావత్తు తెలంగాణ ఉద్యమానికి బాట చూపించిందని గుర్తు చేశారు. ఆ జైలు గోడను తన ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.40 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జూలై 22న దాశరధి జయంతి సందర్భంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కొత్త తరానికి దాని ప్రాముఖ్యత తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
లుక్ కల్చరా లేదా బుక్ కల్చరా అంటే, బుక్ కల్చరే మంచిదని స్పష్టం చేశారు. పుస్తక సంస్కృతిలోకి మనం పిల్లలను లాగకపోతే పెద్ద తప్పు చేసిన వాళ్లం అవుతామని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన సాహితీవేత్తలు ఉన్నారని తెలిపారు. తరతరాల నుంచి ఉన్న ఈ అద్భుతమైన సాహిత్య సంపదను చక్కగా కొనసాగించాలని ఆకాంక్షించారు. హరిద రచయితల సంఘం కార్యకలాపాలు సాగించడానికి ఒక నిర్ధిష్టమైన స్థలం అవసరమని, అందుకు వేదికను ఏర్పాటు చేస్తామని కవిత హామీ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా హరిద కార్యకలాపాలు విస్తరించాలని అన్నారు.
మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న వాటిని తరమాలి - కవిత
ఢిల్లీ నగర నడిబొడ్డున ఒక ఆడపిల్లను కత్తిపోట్లు పొడిచి బండరాయితో తలపై మోది చంపేస్తే కూడా చుట్టూ ఉన్నవాళ్లు వీడియోను చిత్రీకరించారు కానీ ఎవరూ ఆపలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఎటు నుంచి ఎటు పయనిస్తున్నామన్నది ఆలోచించుకోవాలని అన్నారు. దరిద్రపు సెల్ ఫోన్లు అనేది చేతికి, మనిషికి ఎక్స్ టెన్షన్‌లా తయారయ్యి సున్నితత్వం లేని విధంగా మనుషులు ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ రకరకాల అంశాలు ఇంటిదాక వస్తున్నాయని, మన నోటును కొల్లగొట్టడానికి, మన ఓటును పోగొట్టడానికి వస్తున్న అంశాలు పక్కనబెడితే.. మన సున్నితత్వాన్ని, మన మానవత్వాన్ని కొల్లగొట్టడానికి వస్తున్న అంశాలను తప్పకుండా తరిమికొట్టాలని కల్వకుంట్ల కవిత పిలుపు ఇచ్చారు.





















