Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న కరోనా.. వారికి థర్డ్ వేవ్ ముప్పు తప్పదా ?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంజా విసురుతున్న కరోనా మహమ్మారి. క్రితం రోజుతో పోల్చితే జిల్లాలో రెట్టింపు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయ్. నిజామాబాద్ జిల్లాలో గురువారం 60 మందికి కరోనా సోకగా.. కామారెడ్డిలో 14 మంది కొవిడ్ బాధితులుగా మారారు. క్రితం రోజుతో పోల్చితే రెట్టింపు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి తరువాత కరోనా ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి నిజామాబాద్ ఒకటి.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ బాధితులు, కాంటాక్ట్ అయిన వ్యక్తులు, అనుమానిత వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. సామాన్య ప్రజలతో పాటు ఆయా ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు మహమ్మారి భారిన పడుతున్నారు. ప్రతిరోజూ జిల్లాలో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతునే ఉన్నాయి. ఒకరికి కరోనా సోకిందంటే అతని ద్వారా కుటుంబ సభ్యుల్లోని వారికి వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో తీవ్రత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ ఎవరికి కరోనా సోకిందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది బాధితులు లక్షణాలు లేకుండా వ్యాధి భారిన పడుతుండడమే దీనికి ప్రధాన కారణం. ఆయా ప్రాంతాల్లోని పలు స్వచ్ఛంధ కమిటీలు, కాలనీల సభ్యులు, ప్రజలు వైరస్ విస్తరించకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
ఇంట్లోని వ్యక్తులు బయటకు వెళ్తున్న సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించడంతో పాటు తప్పనిసరిగా శానిటైజర్ వినియోగించేలా దృష్టి సారించాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు యువతతో పాటు ఆయా వర్గాల్లో ప్రాణాపాయస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో రెండోవేవ్ ప్రారంభ సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీస మాస్క్ కూడా ధరించకుండా విచ్చలవిడిగా సంచరించిన సందర్భాలు ఉన్నాయి. రెండో వేవ్‌లో పెద్దఎత్తున రోజుల వ్యవధిలోనే వైరస్ ప్రభావంతో ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన రేపుతున్న కరోనా థర్డ్‌వేవ్ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, జాగ్రత్తలు పాటించకపోయిన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాలు, గ్రామాలకు వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇది స్థానిక ప్రజల్లో మరింత ఆందోళన కల్గిస్తోంది. జిల్లాలోని 22 మండలాల పరిధిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పీహెచ్‌సీ స్థాయిలో అనుమానితులకు ర్యాపిడ్ కిట్లతో పరీక్షలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మరోవైపు, పాజిటివ్ వచ్చిన ఇంట్లోనే కొందరు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొంచి ఉన్న ప్రమాదం రాష్ట్రంలో థర్డ్‌వేవ్ త్వరగా విస్తరిస్తోందని రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది.
వచ్చే నాలుగైదు వారాలు వైరస్ ఉధృతి మరింత పెరుగుతుందని హెచ్చరించిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో వ్యాధిని కట్టడి చేసేందుకు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రతను తగ్గించాలంటే కొవిడ్19 నిబంధనలు పాటించడంతో పాటు జాగ్రత్తలు తప్పనిసరని వైద్యాధికారులు చెబుతున్నారు. భౌతికదూరం, ముఖానికి మాస్క్ వ్యక్తిగత శుభ్రత, శానిటైజేషన్‌ను తప్పనిసరిగా పాటిస్తూ స్వీయరక్షణ చర్యలు పాటించాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాల శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడేవారు వైరస్ భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Bhogi Wishes in Telugu: భోగ భాగ్యాల భోగి రోజు.. ఇలా శుభాకాంక్షలు చెప్పండి
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 84,280 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 2707 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,02,801కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 20,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 582 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 6,78,290కి చేరింది.
Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన