Praja Sangrama Yatra: ప్రజా సంగ్రామ యాత్రలో 3 నెలల బాబుకు ప్రధాని మోదీ పేరు పెట్టిన బండి సంజయ్
Praja Sangrama Yatra: బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నేడు భైంసాలో పర్యటించారు. అక్కడ మూడు నెలల బాబుకు నామకరణం చేశారు.
Praja Sangrama Yatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్మల్ జిల్లాలో ప్రారంభం అయింది. జిల్లాలోని అడెల్లి పోచమ్మ ఆలయం నుంచి 5వ విడత "ప్రజా సంగ్రామ యాత్ర"ను బండి సంజయ్ లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈరోజు భైంసాలో పర్యటించారు. ఈ క్రమంలోనే భైంసా కోర్వగల్లీకి చెందిన యెడ్ల మహేష్, నాగ జ్యోత్స్న దంపతులు బండి సంజయ్ ను కలిశారు. తమ 3 నెలల బాబుకు నరేంద్ర మోదీ పేరు పెట్టాల్సిందిగా బండి సంజయ్ ని కోరారు. ప్రధాని మోదీపై అభిమానంతో తమ బాబుకి ఆ పేరు పెట్టమని బండి సంజయ్ అడగ్గా ఆయన స్పందించారు. వెంటనే ఉత్సాహంగా యెడ్ల మహేష్, నాగ జ్యోత్స్న దంపతుల కోరిక మేరకు వారి 3 నెలల బాబుకు విశ్వేస్ నరేంద్ర మోదీ యెడ్ల అని నామకరణం చేశారు.
భైంసా బాధితులతో బండి సంజయ్ మాటామంతి..
భైంసా మత ఘర్షణల్లో ఇండ్లు కాలిపోయి, సర్వస్వం కోల్పోయిన 30 బాధిత కుటుంబాలతో బండి సంజయ్ భేటీ అయ్యారు. బాధిత కుటుంబాల కష్ట సుఖాలను, వారి ఆర్ధిక స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘనను గుర్తు చేసుకుని బాధితులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ బాధితులను ఓదార్చారు. మాపైనే దాడి చేసి, మాపైనే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, తీవ్రంగా వేధించారని వాపోయారు. ఆ సమయంలో మాకు అండగా నిలిచింది, మా కోసం కొట్లాడింది మీ ఆధ్వర్యంలోని బీజేపీనే బండి సంజయ్ కు వివరించారు. ఇప్పటికీ మమ్మల్ని కేసీఆర్ ప్రభుత్వం ఆదుకోక పోగా... ఇప్పటికీ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భైంసా మత ఘర్షణల్లో ఇండ్లు కాలిపోయి, సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలతో భేటీ అవ్వడం జరిగింది. మాపై దాడి చేసి, మాపైనే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి, తీవ్రంగా వేధించారంటూ భైంసా బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. pic.twitter.com/CcqhPCxeWt
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) November 29, 2022
స్పందించిన బండి సంజయ్.. వారు కన్నీరు పర్యంతం అవడం బాధ కల్గించిందని తెలిపారు. ఆ సమయంలో మాకు అండగా నిలిచింది, మా కోసం కొట్లాడింది బీజేపినే అని వారు చెప్పడం.. తన బాధ్యతను మరింత పెంచిందని ట్వీట్ చేశారు.
ప్రజాసంగ్రామ యాత్రకు షరతులతో కూడి అనుమతి
బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. భైంసా వెళ్లకూడదని, బహిరంగ సభను భైంసా పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని ఆదేశించింది. పాదయాత్రలో 500 మందికి, సభలో 3 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే బహిరంగ సభ నిర్వహించాలని తెలిపింది. పాదయాత్ర, సభల్లో ఇతర మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది. అలాగే కార్యకర్తలు కర్రలు, ఆయుధాలు వాడొద్దని హైకోర్టు ఆదేశించింది. కోర్టు సూచనలతో బీజేపీ బహిరంగ సభాస్థలిని మార్చింది. సభావేదికను భైంసాకు మూడు కిలోమీటర్ల అవతల ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.