Narayanpet Violence: మహిళకు ఫుల్లుగా మద్యం తాగించారు.. ఆపై ఊహించని దారుణం..
ఓ మహిళకు ఫూటుగా కల్లు తాగించి ఇద్దరు వ్యక్తులు ఆమెను చంపేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ఆమెను హత్య చేసినందుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మహిళకు ఫూటుగా మద్యం తాగించి గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటన నారాయణపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ మహిళను అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆమె శవాన్ని మాయం చేసేందుకు శత విధాలా ప్రయత్నించారు. చివరికి ఈ విషయం పోలీసులకు తెలిసిపోవడంతో నిందితులు దొరికిపోయారు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. నారాయణపేట పట్టణంలోని బీసీ కాలనీలో కర్రెమ్మ అనే 45 ఏళ్ల మహిళ నివాసం ఉంటోంది. ఈమె ఆ ప్రదేశంలోనే కాగితాలు, పాత ఇనుప సామాన్లు సేకరించి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 5వ తేదీన ఉదయం కర్రెమ్మను అదే కాలనీలో నివాసం ఉండే నరేశ్, నారాయణ అనే వ్యక్తులు బైక్‌పై ఎక్కించుకుని ఊట్కూర్ మండలంలోని తిప్రాస్ పల్లికి ముగ్గురూ కలిసి వెళ్లారు.
ఆ ఊరిలో ఉన్న కల్లు దుకాణంలో కర్రెమ్మకు ఫూటుగా కల్లు తాగించి, వారూ కూడా పీకలదాకా తాగారు. అనంతరం ఆ గ్రామ శివారుకు చేరుకున్నవారు మహిళతో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు వ్యక్తులు కర్రెమ్మను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం నిందితులు ఆ మృత దేహాన్ని ఎలాగైనా మాయం చేయాలనుకొని పాడుపడిన నిర్మాణంలో కట్టెలు వేసి దహనం చేసేయాలని ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో శవాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి మోడాల్ వంతెన కింద వేసేశారు. తిరిగి వారిద్దరు నిందితులు గుట్టుచప్పుడు కాకుండా బైక్‌పైనే నారాయణపేటలోని ఇళ్లకు చేరుకున్నారు.
పోలీసులకు ఫిర్యాదు
ఇదిలా ఉండగా.. ఈ విషయం తెలియని కర్రెమ్మ పెద్ద కుమారుడు మారెప్ప శుక్రవారం తన తల్లి కోసం చాలా చోట్ల వెతికాడు. బంధువుల ఇళ్ల వద్ద కూడా వాకబు చేశాడు. ఎక్కడా ఆమె జాడ తెలియకపోవడంతో చేసేది లేక, కాలనీవాసుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు అతని ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు.
ఈ విచారణలో కర్రెమ్మను హత్య చేసింది తామేనని ఇద్దరూ అంగీకరించారు. వారు తెలిపిన వివరాల మేరకు నారాయణపేట సీఐ నేతృత్వంలో పోలీసుల టీమ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే, అరెస్టు చేసిన నిందితులను తమకు అప్పగించాలని బాధిత మహిళకు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద డిమాండ్ చేశారు. అయితే, ఇవ్వడం కుదరదని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడంతో అందరూ వెనుదిరిగారు.