Vanama Raghava: ఏలూరుకు ‘గూడెం’ టీఆర్ఎస్ నేతల క్యూ - వనమా రాఘవకు సానుభూతి తెలపడంపై విపక్షాలు ఫైర్
Vanama Raghava: ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో జైలుకు వెళ్లొచ్చిన వనమా రాఘవను టీఆర్ఎస్ నేతలు పరామర్శించడం, సానుభూతి తెలపడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
Vanama Raghavendra Rao: వనమా రాఘవ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. 62 రోజుల పాటు జైలులో ఉన్న వనమా రాఘవ కోర్టు ఆంక్షల నేపథ్యంలో ఏలూరులోనే ఉంటున్నాడు. కొత్తగూడెం నియోజకవర్గం (Kothagudem Assembly constituency)లో అడుగుపెట్టవద్దని కోర్టు ఆంక్షలు విధించింది.
రాఘవకు బెయిల్ వచ్చే వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బెయిల్ రాగానే తన కొడుకును అన్యాయంగా కేసులో ఇరికించారని, రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలాంటి పనులు చేశారని వ్యాఖ్యలు చేయడం దుమారం లేపాయి. దీంతో ఇప్పటి వరకు వనమా రాఘవ పేరును వ్యాఖ్యానించేందుకు ఆచితూచి అడుగులు వేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏలూరుకు క్యూకడుతున్నారు. ఈ విషయంపై ఇప్పుడు రాజకీయంగా చర్చగా మారింది.
సానుబూతా.. రాజకీయ ఎత్తుగడా..?
వనమా రాఘవపై ఇప్పటి వరకు 12 తీవ్ర నేరారోపణ కేసులు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. అయితే ఇవన్ని కేవలం రాజకీయంగా దెబ్బతీసే కేసులేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ కుట్రలు అయితే తీవ్ర నేరారోపణ కేసులు ఎందుకు నమోదవుతాయి.. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రెండు కేసులు నమోదు ఎలా అవుతాయి..? అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వనమా రాఘవ పేరు ప్రస్తావన చెప్పేందుకు వెనుకంజ వేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాఘవకు బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఉంటున్న ఏలూరుకు క్యూకట్టడం తీరు చూసి జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పాత సంఘటనలకు పుల్‌స్టాప్ పెట్టి సానుబూతి వచ్చేలా ఈ వ్యూహం అనుసరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాఘవను సస్పెండ్ చేస్తూ టీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకునప్పటికీ టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏలూరుకు పయనం కావడం అక్కడ పరామర్శలు చేయడం వెనుక కొత్త రాజకీయ ఎత్తుగడలానే కనిపిస్తుంది.
నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పరామర్శలా..?
ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్ నేతల తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యాడనే ఆరోపణలతోపాటు ఇప్పటి వరకు 12 తీవ్ర నేరారోపణలు కలిగిన కేసుల్లో రాఘవ ఉన్నాడని పోలీసులు ప్రకటించినప్పటికీ బెయిల్ రాగానే రాఘవకు పరామర్శల పేరుతో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఏలూరుకు పయనం కావడం ఇప్పటికీ ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.
ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరామర్శలు చేస్తారు కానీ ఓ కుటుంబం ఆత్మహత్యకు కారణమయ్యాడనే కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తికి ఎలా పరామర్శలు చేస్తారని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నేతలను విమర్శిస్తున్నాయి. ఏది ఏమైనా కొత్తగూడెం టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తల తీరు ఇప్పుడు రాజకీయంగా మరోమారు కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుందనే చెప్పవచ్చు. మరి ఇది ఎటు దారి తీస్తుందనేది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదు.
Also Read: Khammam Politics: ఖమ్మం కారులో రాజకీయ వేడి - టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకున్నా పోటీకి సీనియర్లు సై !