బీజేపీ గెలిస్తే 3000 పెన్షన్ ఇస్తారా? గుజరాత్, కర్ణాటకలో లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Munugode Bypolls: బీజేపీ గెలిస్తే రూ.3000 పెన్షన్ ఇప్పిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు.
Munugode Bypolls: మునుగోడు ఎన్నికల ప్రచారం రోజురోజుకూ హీటెక్కుతోంది. బీజేపీ గెలిస్తే రూ.3000 పెన్షన్ ఇప్పిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. బీజేపీ గెలిస్తే నిజంగానే 3000 పెన్షన్ ఇస్తారా? అయితే ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో బీజేపీలో రూ. 700 పెన్షన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో రూ. 600 పెన్షన్ ఇచ్చేవాళ్లు, తెలంగాణలో రూ.3000 ఇస్తారంట అంటూ ఎద్దేవా చేశారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజుల చేపిస్తా అన్నాడట రాజగోపాల్ రెడ్డి అసుంటోడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 3000 పెన్షన్ ఇచ్చి, తెలంగాణకి వచ్చి ఈ మాటలు చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.
రూ.200 పింఛన్ ను రూ.2000 చేశాం
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాకే 24 గంటలు కరెంట్ ఇచ్చిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే రూ.200 పెన్షన్ రూ.2000 అయిందని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుభీమా, ఎవరు తెచ్చారు కేసీఆర్ కాదా? టీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. భూమికి బరువైన పంట పండుతోంది. తెలంగాణలో గింజ కూడా మిగలకుండా కొన్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ, కేటీఆర్ కిట్ ఇవన్నీ మీ కండ్ల ముందే జరుగుతున్న నిజాలు అని మునుగోడు ప్రజలకు వివరించారు. 1000 ఇళ్లు ప్రభుత్వం ఇచ్చినా.. కాంట్రాక్టర్ అయిన రాజగోపాల్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టియ్యలేదని గుర్తుచేశారు.
రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్
‘ఎంబీబీఎస్ లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ తీసుకొచ్చాం. 6615 ఎంబీబీఎస సీట్లలో 661 సీట్లు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి. విద్యలో, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్.. గిరిజనులకు మంచి అవకాశాలు వస్తాయి. ఎన్నికల్లో గెలిపిస్తే ఏడాది లోపు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం. ఇచ్చిన మాట నెరవేర్చే బాధ్యత నాది. ఆగం కాకుండా మొదటి డబ్బా మీద 2 నంబర్ బటన్ కారు గుర్తు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఫొటో మీద ఓటు వేసి దీవించండి. నా బాధ్యత తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని’ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
ఓవైపు రాజగోపాల్ రెడ్డి మొన్నటివరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేకుండానే పోయిందని, బీజేపీ మందు సీసాలు, పైసలు ఇచ్చి ఓట్లు కొనాలని చూస్తోంది జాగ్రత్త అని మునుగోడు ఓటర్లకు మంత్రి హరీష్ రావు సూచించారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకంటారా? అభివృద్ధి చేసే టీఆర్ఎస్ ని గెలిపిస్తారా? అని స్థానికులతో నవ్వుతూ అన్నారు.
నేడు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయానికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం మాజీ ఎంపీ బూర నర్సయ్యను కలిశారు. బూర నర్సయ్య బీజేపీలో చేరడం ఖాయమని బండి సంజయ్ రెండు రోజుల కిందట అధికారికంగా వెల్లడించారు.