Munugode By-election Results 2022 Live: మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు - కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు సంబంధించి లైవ్ అప్ డేట్లు మీరు ఇక్కడ చూడవచ్చు. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE

Background
మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు - కేటీఆర్
నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక విజయం తర్వాత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్... నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టులతో తెచ్చిన ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారన్నారు. అహంకారంతో, డబ్బు మదంతో కళ్లు నెత్తికొక్కి మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దారని కేటీఆర్ విమర్శించారు. దిల్లీ బాసులు మోదీ, అమిత్ షాకు తెలంగాణ ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో కనిపించింది రాజగోపాల్ రెడ్డి అయినా వెనకుండి నడిపించింది దిల్లీ బాసులు అని మండిపడ్డారు. 9 రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చారని, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడులో కారుదే హవా, 10 వేలకు పైగా మెజార్టీ
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేలకు పైగా మెజార్టీ సాధించారు. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6608, బీజేపీకి 5553 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1055 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో మొత్తం మెజార్టీ 10191 ఓట్లకు చేరింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.
13వ రౌండ్ లోనూ గులాబీ పార్టీదే హవా, 9 వేలకు పైగా ఆధిక్యం
Munugode Bypoll : మునుగోడు ఉపఎన్నికల ఓట్ల కౌంటింగ్ ముగింపు దశకు చేరుకుంది. 13వ రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థికి 6619 ఓట్లు, బీజేపీకి 5406 ఓట్లు వచ్చాయి. ఈ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1285 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 9136 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంది.
Munugode bypoll : 12వ రౌండ్ టీఆర్ఎస్ దే, 7 వేలు దాటిన ఆధిక్యం
Munugode bypoll :మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు 12 రౌండ్లు ముగిశాయి. 12వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7440 ఓట్లు, బీజేపీకి 5398 ఓట్లు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం 7836 ఓట్లకు చేరింది.
Munugode By Elections News: 11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌దే పై చేయి, మొత్తం కలిపి 5,765 ఓట్ల మెజారిటీ
మునుగోడు ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. 11వ రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం కనబర్చింది. 11వ తర్వాత టీఆర్ఎస్ కు 5,765 ఓట్ల మెజారిటీ వచ్చింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

