Nalgonda Politics: నల్గొండలో సీఎం రేవంత్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి.. చిచ్చురేపిన డీసీసీ అధ్యక్ష పదవి
నల్గొండలో సీఎం రేవంత్ అనుచరులకే డీసీసీ పదవి ఇచ్చారని, తన కులం కారణంగా సైతం పదవి రాలేదని గుమ్ముల మోహన్ రెడ్డి ఆరోపించారు.

నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా, నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై గుమ్ముల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కోమటిరెడ్డి అనుచరుడు అవడం వల్లే రేవంత్ రెడ్డి మనుషులకు మాత్రమే పదవులు వస్తున్నాయని, అందుకే తనకు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేశారని ఆయన ఆరోపించారు. తనకు నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి దక్కుతుందని ఆశించానని, కానీ కాంగ్రెస్ పార్టీలో గట్టిగ తిడితేనే పదవులు వస్తాయని, నిబద్ధతతో పార్టీ జెండా మోసిన నాయకులకు పదవులు రావని గుమ్ముల మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు జిల్లా అధ్యక్ష పదవి దక్కకపోవడానికి కులమే అడ్డంగా మారింది అని గుమ్ముల మోహన్ రెడ్డి ఆరోపించారు. పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా తాను నిబద్ధతతో పని చేశానని తెలిపారు. నల్గొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని నాయకులంతా తన పేరునే డీసీసీ అధ్యక్ష పదవికి సూచించారని, జిల్లాలో 75 శాతం మంది తన పేరే చెప్పినా పదవి దక్కలేదని తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు.
మంచి రోజులు వచ్చాయనుకుంటే అన్యాయం చేశారు..
పార్టీ కోసం పనిచేస్తానని చెబుతూనే గుమ్ముల మోహన్ రెడ్డి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లగక్కారు. ‘కోమటిరెడ్డి వెంకట్ రెడ్డ నా భుజం మీద చెయ్యిస్తే నాకు మంచి రోజులు వచ్చాయనుకున్నాను. కానీ నవ్వుతూ గొంతు కోస్తారనుకోలేదు. అయితే డీసీసీ పదవి ఇవ్వకుంటే ఆ విషయం నాకు ముందే చెబితే బాగుండేది. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయితే చాలు పదవులు వస్తాయి. అయిదారు నియోజకవర్గాల్లో నా పేరు చెప్పినా కూడా చివరికి లిస్టులో నా పేరు లేదు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పార్టీలో పదవులు ఇవ్వడం ద్వారా నాలాంటి ఎంతో మందికి అన్యాయం జరుగుతోంది. నా తరువాత పార్టీలోకి వచ్చిన వారికి సైతం పదవులు వచ్చాయి. ఏడాదిన్నర కిందట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తలుచుకుంటే నాకు కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చేది. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని సైతం హామీ ఇచ్చారు. నా తరువాత 20 మందికి కార్పొరేషన్ పదవులు వచ్చాయని’ ఆవేదన వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డే కారణమని మరోవైపు ప్రచారం..
తనకు పదవి రాకపోవడానికి తన కులం, మరికొందరు అడ్డంకిగా మారారని గుమ్ముల మోహన్ రెడ్డి ఆరోపిస్తుండగా.. తన అనుచరుడికి డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డే చేశారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తాను కాకుండా, తన కింద ఎవరూ ఎదగకుండా కోమటిరెడ్డి ఈ విధంగా చేశారని కొన్ని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.






















