MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత కాలుకు ఫ్రాక్చర్ - మూడు వారాల బెడ్ రెస్ట్ !
ఎమ్మెల్సీ కవిత కాలుకు ఫ్రాక్చర్ కావడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
MLC Kavitha : తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయపడ్డారు. ఆమె కాలుకు ఫ్రాక్చర్ అయినట్లుగా నిర్ధారణ కావడంతో మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కవిత సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నేరుగా కలవలేనని సోషల్ మీడియా ఖాతా ద్వారా సాయం అవసరం అయినవాళ్లు సంప్రదించవచ్చని తెలిపారు.
Due to Avulsion fracture, I have been advised bed rest for 3 weeks.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 11, 2023
My @OfficeOfKavitha shall be available for any assistance or communication.
గాయం ఎలా అయిందన్న అంశాన్ని చెప్పని కవిత
అయితే ఫ్రాక్చర్ అయ్యేంత గాయం ఎలా అయిందన్న విషయం మాత్రం కవిత సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించలేదు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చి మొదటి ఉద్యమంగా మహిళా రిజర్వేషన్ అంశాన్ని తీసుకున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో , ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
భారత జాగృతి పోరాటం మరికొంత ఆలస్యం
తెలంగాణ జాగృతి కార్యాచరణలో భాగంగా మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతోపాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు నిర్వహించనున్నారు. ఈ నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్టు కార్డులు పంపనున్నారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండనే విధంగా క్యాంపైన్ ప్రారంబించాలనుకున్నారు. అయితే ప్రస్తుతం మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ అవసరం కావడంతో ఈ ఉద్యమ కార్యాచరణ అంతా వాయిదా పడినట్లుగానే భావిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడు వారాల పాటు ఈడీ విచారణ కూడా లేనట్లే ?
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూడా కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె పలు మార్లు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన పది ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు. ఈ పది ఫోన్ల విశ్లేషణ తర్వాత ఆమెను మరోసారి ఈడీ అధికారులు విచారణకు పిలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమె గాయపడటంతో ఆ విచారణ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఒక వేళ విచారించదల్చుకుంటే ఈడీ అధికారులు ఇంటికే వచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని సుప్రీంకోర్టులోపిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నెలాఖరులో జరగనుంది.