MLA Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ హయాంలో 300 కోట్ల మైనింగ్ దోపిడీ - పటాన్ చెరు ఎమ్మెల్యేపై ఈడీ సంచలన ఆరోపణలు
Patacheru MLA: కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో చిక్కుకున్నారు. మూడు వందలకోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఈడీ గుర్తించింది.

MLA Gudem Mahipal Reddy cheating Telangana Government: తెలంగాణలో మైనింగ్ మోసాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు మరోసారి సంచలన విషయాలను బయట పెట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూధన్ రెడ్డి అక్రమ మైనింగ్ ద్వారా ప్రభుత్వాన్ని మోసం చేసి రూ.300 కోట్లు సంపాదించారని ఈడీ గుర్తించింది. మెస్సర్స్ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీ యజమాని మధుసూధన్ రెడ్డి, ఇతరులు అసైన్డ్ క్వారీ ప్రాంతాల్లో అదనపు తవ్వకాలు చేసి, ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ నిర్వహించారని ఈడీ తెలిపింది. దీని ఫలితంగా ప్రభుత్వానికి రాయల్టీ కింద రూ.39.08 కోట్లు నష్టం జరిగింది. ఈ కుంభకోణంలో రూ.80 కోట్ల విలువైన 81 ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది.
పటాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సోదరుడు మధుసూధన్ రెడ్డి నడిపే మెస్సర్స్ సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం మైనింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. అయితే, ఈ కంపెనీ తమ భాగస్వామ్య సంస్థ గూడెం జివిఆర్ ఎంటర్‌ప్రైజెస్ కు సబ్-కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ సబ్-కాంట్రాక్టింగ్ లీజు అనుమతించలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ఈ లీజు ద్వారా అసైన్డ్ ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేసి, భవన నిర్మాణ రాళ్లు, రోడ్ మెటల్ వంటి వాటిని అమ్ముకున్నారు. వీటిని ప్రధానంగా నగదు రూపంలో విక్రయించి, మొత్తం రూ.300 కోట్లు సంపాదించారని ఈడీ దర్యాప్తులో తెలిపింది. దీని వల్ల ప్రభుత్వానికి రాయల్టీ కింద రూ.39.08 కోట్లు ఆదాయం నష్టం జరిగింది.
ఈడీ దర్యాప్తులో, ఈ అక్రమ మైనింగ్ నుంచి వచ్చిన ఆదాయం ను బినామీల పేర్లలో ఆస్తులుగా పెట్టుబడి పెట్టినట్లు తేలింది. పటాన్‌చెరు పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో మహిపాల్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి, జి. విక్రమ్ రెడ్డి మొదలైనవారు భాగస్వాములుగా ఉన్నారు.
జూన్ 2024లో ఈడీ మహిపాల్ రెడ్డి, మధుసూధన్ రెడ్డి ఇళ్లతోపాటు పాటు 10 చోట్ల సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.19 లక్షల నగదు, అనేక బినామీ ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు సమయంలో మధుసూధన్ రెడ్డి వద్ద అసలు ఆస్తి డాక్యుమెంట్లు లభించాయి. ఈ ఆస్తులు వేర్వేరు వ్యక్తుల పేర్లపై ఉన్నప్పటికీ, డాక్యుమెంట్లు మాత్రం యజమానిగా మధుసూధన్ రెడ్డి ఉన్నట్లు తేలింది. వారు మధుసూధన్ రెడ్డి బినామీలే అని వెలుగులోకి వచ్చింది.దీని ఫలితంగా, రూ.78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. ఈ సంస్థల పేర్లలో రూ.1.12 కోట్ల స్థిర డిపాజిట్లను కూడా అటాచ్ చేశారు. మొత్తం రూ.80 కోట్లకు పైగా ఆస్తులు జప్తు చేశారు.
ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే జూలై 2024లో గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ మోసాలు జరిగాయి. ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు, ఆస్తుల జప్తు జరిగే అవకాశం ఉంది.




















