Farmer Suicide: కన్నబిడ్డలా చూసుకున్న పంట ఒడిలోనే.. రైతు రవీందర్ ఆత్మహత్య..
ఆరుగాలం పండించిన పంటలోనే ఓ రైతు తనువు చాలించాడు. చేసిన అప్పు తీరే దారిలేక.. కన్నబిడ్డలాంటి పంట ఒడిలోనే కన్నుమూశాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామానికి చెందిన రవీందర్(52) వ్యవసాయం చేస్తుంటాడు. తనకు ఉన్న రెండు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాడు. పంటను చూసి మురిసిపోయిన రైతన్న.. చేతికి వచ్చాక.. అప్పులు తీర్చుకోవచ్చులే అనుకున్నాడు. కొంతకాలంగా వాతావరణంలో వస్తున్న మార్పులతో మిరప పంటకు తెగుళ్లు పట్టుకున్నాయి. దానిని నివారించేందుకని.. రూ.2 లక్షలపైగా అప్పు చేశాడు. అయినా తెగుళ్లు మాత్రం తగ్గలేదు.
అయితే అంతకుముందు ఏడాది కూడా ఐదెకరాలు కౌలుకు తీసుకుని.. మిర్చిపంటనే వేశాడు రవీందర్. అప్పుడు కూడా అప్పులయ్యాయి. ఈ ఏడాది, గతేడాది అప్పులు కలిపి.. రూ.15 లక్షల వరకు అయింది. అప్పులు తీర్చే దారి కనిపించలేదు. ఓ వైపు అప్పులు కళ్ల ముందే కనిపించాయి. ఇక చనిపోవడమే దారి అనుకున్నాడో ఏమో.. మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రోజున తాను కన్నబిడ్డలా పెంచుకున్న పంటకు దగ్గరకు వెళ్లాడు. పంటలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. రవీందర్ కు భార్య సులోచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అందరికీ ధైర్యం చెప్పే రైతు రవీందర్.. ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై విషాదం నెలకొంది. ఎంతో ధైర్యంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఇన్ని రోజులు తమ మధ్యే ఉన్న ఉండి.. ఇకపై కనిపించడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవలే మరో మిరప రైతు
ఇటీవలే ఓ మిరపరైతు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలోని దూద్యా తండాకు చెందిన బుక్కు మిరపతోట వేశారు. ఆయనకు ఎకరం భూమి ఉంది. మరో ఎకరాన్ని కౌలుకు తీసుకుని మరి సాగు చేశాడు. మెుత్తం మూడు లక్షలకుపైగా అప్పు అయింది. పంట చేతికి వచ్చాక అప్పు తీర్చొచ్చు అనుకున్నాడు. కానీ పంటకు పురుగు పట్టింది. మళ్లీ అప్పులు చేసి.. మందులు కొట్టాడు అయినా పరిస్థితిలో మార్పు కనిపించలేదు. ఇక తన పంటకు ఆశించిన దిగుబడి రాదని మనస్తాపానికి గురయ్యాడు బిక్కు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: Farmer Suicide: పంట సాగు కోసం అప్పు చేసిన రైతు.. దిగుబడి రాదని మనస్తాపంతో ఆత్మహత్య
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి