Ponnam Prabhakar: మంత్రి కొండా సురేఖ వివాదం - మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాలన విజయవంతంగా సాగిందని.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి హామీలు నెరవేరుస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
Minister Ponnam Key Comments On Konda Surekha Issue: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) వ్యాఖ్యల వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాక కూడా సినిమా వాళ్లు స్పందించడం సరికాదని.. ఆమె వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నాక సమస్య ముగిసినట్లేనని అన్నారు. బలహీనవర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. 'సినిమా వాళ్ల ఎపిసోడ్‌లో కొంత సంయమనం పాటించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఫిర్యాదుదారులు మంత్రి సురేఖ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని అడగ్గా.. ఆమె అలానే చేశారు. అయినా సినిమా వాళ్లు దీనిపై చర్చను కొనసాగించారు. కొండా సురేఖను అవమానించేలా పోస్ట్ చేసిన అంశంపై కూడా సినిమా వాళ్లు స్పందిస్తే బాగుండేది.' అని పొన్నం పేర్కొన్నారు.
'హామీలు నెరవేరుస్తున్నాం'
కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాలన విజయవంతంగా సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు అధిగమించి హామీలు నెరవేరుస్తున్నామన్నారు. 'రైతుల పేరుతో మొన్న బీజేపీ, నేడు బీఆర్ఎస్ ఆందోళనకు దిగాయి. ఆ రెండు పార్టీలు ఒకటే. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల వరద నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం రూ.400 కోట్లు ఇచ్చింది.' అని పేర్కొన్నారు.
ఇదీ వివాదం
మంత్రి కొండా సురేఖ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమంటూ ఆరోపించారు. 'హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది, హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది నువ్వు కాదా.? కేటీఆర్' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు రాగా.. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే తన వ్యాఖ్యల ఉద్దేశం అని.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనపై కేవలం తనకు అభిమానం మాత్రమే కాదని.. ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ ఎవరైనా మనస్తాపానికి గురైతే బేషరతుగా తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అటు, కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మంత్రిపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం దావా కూడా వేస్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సైతం పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. మరోవైపు, మంత్రి సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో నాగార్జున తరఫు న్యాయవాది క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read: Hydra Ordinance : కబ్జా దారులకు చట్టబద్దమైన హెచ్చరిక - హైడ్రా ఆర్డినెన్స్‌కుగవర్నర్ ఆమోదం !