Vande Bharat Express : వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి, ఈసారి ఎక్కడంటే?
Vande Bharat Express : సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది.
Vande Bharat Express : సికింద్రాబాద్, విశాఖ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రైస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది. మహబూబాబాద్-గార్ల రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి వందే భారత్ రైలుపై రాయి విసరడంతో ఒక బోగి అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు విచారణ చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు వందే భారత్ రైలు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్ల దాడిలో రైలు C-8 కోచ్‌లో అద్దం పగిలిందని అయితే ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే పోలీసులు తెలిపారు.
ఖమ్మంలో కూడా
ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ రైలు శుక్రవారం(ఫిబ్రవరి 3) సాయంత్రం ఖమ్మం రైల్వే స్టేషన్ దాటిన వెంటనే గుర్తు తెలియని ముగ్గురు యువకులు రాళ్లతో కొట్టారు. ఈ దాడిలో రైలు కోచ్ అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దుండగుల్ని గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని ఆర్పీఎఫ్ పోలీసులు వెల్లడించారు.
ప్రారంభానికి ముందే రాళ్ల దాడి
వందే భారత్ రైలుపై ప్రారంభానికి ముందే రాళ్ల దాడి జరిగింది. ఇటీవల గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు ట్రయిల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ట్రైన్ బోగీలపై కంచరపలెంలో రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో రెండు కోచ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. రామ్మూర్తి పంతులుపేట గేటు దగ్గర ఆడుతున్న ఆకతాయిలు ట్రైన్ పై రాళ్లు విసిరినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.
ముంబయి నుంచి రెండు రైళ్లు
ప్రధాని నరేంద్ర మోదీ మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ముంబయి-సోలాపూర్, ముంబయి-సాయినగర్ షిరిడీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేతో పాటు డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ హాజరయ్యారు. ఇదే క్రమంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకూ శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. రైల్వేలో వందేభారత్ రైళ్లు కొత్త శకానికి నాంది పలికాయని అన్నారు మోదీ. ఈ రైళ్లు నవభారత్‌కు ప్రతీక అన్న ఆయన..17 రాష్ట్రాల్లోని 108 జిల్లాలు ఈ రైళ్ల ద్వారా అనుసంధానమవుతాయని చెప్పారు. ఇకపై ముంబయి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా ప్రయాణించొచ్చని అన్నారు. ముంబయి, పుణె లాంటి ఆర్థిక కేంద్రాలను అనుసంధానించడం వందేభారత్ రైళ్లతో సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ (CSMT) నుంచి ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. అత్యంత వేగంగా వందేభారత్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వివరించారు. ఇప్పటి వరకూ మొత్తంగా 10 రైళ్లను లాంఛ్ చేసింది కేంద్రం. ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత వేగంగా మార్పులు రావాల్సిన అవసరముందని అన్నారు ప్రధాని. తద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఛార్జీలు ఇలా
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు చైర్‌కార్ టికెట్ రేటు రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ టికెట్ రేటు రూ.3,170గా ఉంది. అదే సికింద్రాబాద్ నుంచి బయల్దేరి వెళ్లే సర్వీసులో విశాఖపట్నానికి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1,665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120గా పేర్కొన్నారు. ఈ టికెట్ రేట్లలో కొంచెం తేడా ఉంది. సాధారణంగా అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమో, ఇక్కడి నుంచి అక్కడికి అంతే దూరం. అయినా అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్ ధరలు ఇలా వేర్వేరుగా ఉన్నాయి. అయితే, మొత్తం టికెట్ ధరలో కలిసిపోయి ఉన్న కేటరింగ్‌కు సంబంధించిన ఛార్జీలు వేర్వేరుగా ఉండడంతో ఈ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.