Revanth Reddy : గోడదూకిన రేవంత్ రెడ్డి, పాఠశాలలోకి వెళ్లి విద్యార్థుల సమస్యలపై ఆరా
Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరిపెడ మండలంలో గోడదూకి గురుకుల పాఠశాలలోకి వెళ్లారు. అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
Revanth Reddy : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోకి గోడ దూకి వెళ్లారు. ఉపాధ్యాయుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ అమలు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల సమస్యలను చిత్త శుద్ధితో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పాఠశాల అవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వికలాంగుడి కుటుంబానికి ఆర్థిక సాయం
మహబూబాబాద్ జిల్లా ఎల్లంపేట స్టేజి తండా వద్ద వికలాంగుడు బాలు ఇంటికి వెళ్లి కలిశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నడవలేని, మాట్లాడలేని 21 ఏళ్ల వికలాంగుడు బాలు తల్లి సంరక్షణలో ఉన్నాడు. బాలు తండ్రి మరణించాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బాలు తల్లి భూక్య తులసి ఆవేదన వ్యక్తం చేసింది. తనకు వితంతు పెన్షన్ కూడా రావడం లేదని ఆవేదన చెందింది. రేవంత్ రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి రూ.10 వేలు సాయం అందించారు. కలెక్టర్ తో మాట్లాడి ప్రభుత్వం తరపున సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
చిట్టి తల్లుల ప్రేమ ముందు
— Revanth Reddy (@revanth_anumula) February 9, 2023
గోడ ఒక లెక్కనా…?!#Day4 #YatraForChange #HaathSeHaathJodo pic.twitter.com/J1ZXPT2RrA
ప్రగతి భవన్ పై మరోసారి కామెంట్స్
ప్రగతి భవన్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్న తరుణంలో ప్రగతి భవన్ పై మరోసారి రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌ను బీఆర్ అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ వేల కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు మియపూర్‌లో 500 కోట్ల విలువైన భూమి ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆదిత్య కన్ స్ట్రక్షన్‌కు భూమి కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు దోచేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఆ జాబితా నుంచి తొలగించి ఎవరి పేరుమీద బదలాయించారో బయటపెట్టాలన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు.
కేటీఆర్ కు కౌంటర్
అసెంబ్లీ లో మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో నాలుగో రోజు పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. తనపై ఏ ఆరోపణ ఉన్నా సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తాను చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. శాసనసభలో సభ్యుడు లేనప్పుడు పేరు ప్రస్తావించకూడదన్న జ్ఞానం కేటీఆర్ కు లేదని విమర్శించారు. తాను సభలో ఉంటే అక్కడే కేటీఆర్ కు సమాధానం ఇచ్చేవాడినన్నారు. అక్రమాలు చేసే అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం కటకటాల్లో పెడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గడీల పాలనకు వ్యతిరేకమన్నారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే పాదయాత్రకు పోలీసుల బందోబస్తు తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్రలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని, కార్యకర్తలు ఉండాలని సూచించారు.