KTR: త్వరలోనే స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నిక, ఆయన గెలుపు గ్యారంటీ!
Station Ghanpur News: స్టేషన్ ఘన్ పూర్ ఎన్నికపై తీర్పు హైకోర్టులో రిజర్వులో ఉందని.. ఆ తీర్పు బీఆర్ఎస్ కే అనుకూలంగా వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
Telangana News: స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈసారి జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున తాటికొండ రాజయ్య భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా పార్లమెంటు ఎన్నికల సమయంలో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎన్నిక గురించి తెలంగాణ హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉందని.. ఆ తీర్పు బీఆర్ఎస్ కే అనుకూలంగా వస్తుందని కేటీఆర్ అన్నారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతోనే ఓడిపోయిందని.. ఈసారి హైకోర్టు తీర్పుతో మనమే అధికారంలోకి వస్తామని అన్నారు. రాష్ట్రం అంతా మోసపోయినా స్టేషన్ ఘనపూర్ ప్రజలు మాత్రం మోసపోలేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం 1.5 శాతం అంటే నాలుగు లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోయామని కేటీఆర్ గుర్తు చేశారు. ఉప ఎన్నిక వచ్చే స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలను మొదటిగా కేసీఆర్ కలుస్తారని.. తర్వాత త్వరలోనే కేసీఆర్ నియోజకవర్గాలుగా అందరిని కలుస్తారు.
ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్టు వేసి మరీ చెప్పారని అన్నారు. ఆగస్టు 15 వచ్చినా కూడా రుణ మాఫీ కాలేదని.. విమర్శించారు. రుణమాఫీ చేస్తున్నామని చెప్పి.. తెలంగాణకు రావాలని రాహుల్ గాంధీని పిలిచారని.. ఇలాంటి బోగస్ మాటలు చెప్తున్నారనే రాహుల్ గాంధీ తెలంగాణకు రావట్లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
విలీనం తప్పుడు ప్రచారం
బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుందని పదే పదే చిల్లర ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాము బెయిల్ కోసం ఢిల్లీలో తిరుగుతుంటే బీజేపీ వాళ్ళను కలుస్తున్నామని అని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. సొంత చెల్లెలు జైలులో ఉంటే తాను బెయిల్ కోసం తిరిగినా తప్పేనా అంటూ ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ నిర్వహిస్తుందని కేటీఆర్ మాట్లాడారు.