KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Formula E Race agreements | బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫార్ములా ఈ రేసు ఒప్పందాలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపణల్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొడాం, చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు.
KTR writes letter to Revanth Reddy over Formula E Race agreements | దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై రాష్ట్ర శాసనసభలో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ రాసిన లేఖలో విషయాలివే..
ఫార్ములా-ఈ రేస్ (Formula E Race In Hyderabad) వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తున్నది. ఇదే విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు సీఎం కార్యాలయం నుండి మీడియాకు ఇస్తున్నారు. అయితే ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా తెలంగాణ శాసన సభ (Telangana Assembly)లో 4 కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయి.
హైదరాబాద్ సిటీకి మేలు జరగాలన్న ఉద్దేశంతోనే
తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుంది. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకుంది. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఫార్ములా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది.
రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలి
నిజానికి ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయి అని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉంది. కనుక మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసన సభ వేదికగా చెబుదాం. శాసన సభ సెషన్ జరుగుతున్నది కనుక మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టండి.
ఫార్ములా-ఈ రేసులో అవకతవకలు జరగలేదు
మరోసారి చెబుతున్నాను. ఫార్ములా-ఈ అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి కానీ జరగలేదు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేస్ను కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారు. దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయి. ’ అని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ రాసిన లేఖలో ప్రస్తావించారు.
Also Read: KTR Enquiry: ఏసీబీ చేతికి అస్త్రం- ఏ క్షణంలోనైనా కేటీఆర్ మీద విచారణ, అరెస్టుకు ఛాన్స్!