KTR Comments : EV ఇండస్ట్రీలో మూడేళ్లలో రూ. 50వేల కోట్ల పెట్టుబడులు - తెలంగాణకు రానున్నాయన్న కేటీఆర్ !
ఎలక్ట్రిక్ వాహన రంగంలో మూడేళ్లలో యాభై వేల కోట్లు పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
KTR Comments : మొత్తం 1200 ఎకరాల్లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఎలక్ట్రిక్ వెహికిల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ క్లస్టర్ జహీరాబాద్, సీతారాంపూర్ లో, ఎనర్జీ స్టోరేజ్ సిస్టం దివిటిపల్లిలో...ఉంటుందని తెలిపారు. ఈ మొబిలిటీ వ్యాలీ ద్వారా రాబోయే 3 సంవత్సరాలలో 50వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, తద్వారా 4 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. మాదాపూర్ హెచ్ఐసీసీలో మొబిలిటీ నెక్స్ట్ హైదరాబాద్ సమ్మిట్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్.. మంత్రి నిరంజన్ రెడ్డి, డెలిగేట్స్ తో కలిసి ఈ మొబిలిటీ వ్యాలీ నమూనా బిల్డింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈవీ రంగంలో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు
తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఇంజినీరింగ్ ఇన్నోవేషన్ క్లస్టర్ లో ఎలెక్ట్రిక్ వెహికిల్స్ బెస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాన్యుఫ్యాచ్ రింగ్, రీసర్చ్ అండ్ డెవెలప్మెంట్ కార్యకలాపాలు జరగనున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో నాలుగు ప్రదేశాల్లో మెగా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని, ఈవీ కంపెనీల కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీల తయారీతో పాటు బ్యాటరీ పార్ట్స్ కూడా తయారవుతాయని చెప్పారు. రానున్న రెండు, మూడు వారాల్లో రూ.3 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయన్న మంత్రి కేటీఆర్.. ఈ మొబిలిటీ వీక్ లో 100కి పైగా స్టార్టప్స్ స్టార్ అప్ ఛాలెంజ్ లో తమ ఆలోచనలు పంచుకోనున్నాయని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ, సహకారాలందిస్తున్నామన్నారు.
యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న కేటీఆర్
యంగెస్ట్ స్టేట్ ఇన్ ఇండియాగా తెలంగాణ అభివృద్ది చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియాలోనే బెస్ట్ సిటీ అయిన హైదరాబాద్ లో ఈ మొబిలిటీ వీక్ ఈవెంట్ జరగడం సంతోషమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వేదికగా ఈ ఈ -మొబిలిటీ వీక్ ఘనంగా ప్రారంభమైందని చెప్పారు. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ఫిబ్రవరి 11న జరగనుందన్న కేటీఆర్.. పర్యావరణ పరిరక్షణ కోసం ఈవీ రంగాన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడ కావల్సినన్ని వనరుల ఉండడం వల్ల ఈవీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
తెలంగాణలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. అమరరాజా కూడా ఈవీ వాహనాలకు తయారయ్యే బ్యాటరీ కంపెనీని పెట్టడానికి ఇటీవలే ఒప్పందం చేసుకుంది పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా వచ్చాయి. వీటి ఉత్పత్తి ప్రారంభమైతే ఈవీ వాహవాల హబ్‌గా హైదరాబాద్ ఎదగనుంందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంధన కొరత కారణంగా భవిష్యత్‌లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకే డిమాండ్ ఉంటుందని.. వాహన ఉత్పత్తి సంస్థలు ఇప్పిటకే ఓ నిర్ణయానికి వచ్చాయి. ప్రతీ సంస్థ ఈవీ ప్లాంట్ ను ప్రత్యేకంగాఏర్పాటు చేసుకుంటోంది. వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.