Kavitha Updates: ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయనున్న కవిత - కాంగ్రెస్ ఖాతాలో పడే చాన్స్
MLC Kavitha: పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఉన్న కవిత పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Kavitha to resign from MLC post: కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక స్వతంత్రంగా రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులన్నింటినీ వదులుకోవాలని డిసైడయ్యారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని అనుకుంటున్నారు. బుధవారం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఏకగ్రీవంగా గెలిచిన కవిత
కవిత ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. కవిత పదవీ కాలం 2028 జనవరి నాలుగో తేదీ వరకూ ఉంది. రెండేళ్ల మూడు నెలల వరకూ పదవీ కాలం ఉంది. కవిత రాజీనామా చేస్తే ఉపఎన్నికలు ఖాయంగా జరుగుతాయని అనుకోవచ్చు. 2022లో జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పట్లో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేని బలం ఉండటంతో పోటీకి ఎవరూ నిలబడలేకపోయారు. అంతకు ముందు అదే స్థానానికి 2020లో జరిగిన ఉపఎన్నికల్లో ఏకపక్షంగా గెలిచారు.
రెండేళ్లకుపైగా పదవీ కాలం - ఉపఎన్నికలు వచ్చే చాన్స్
ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తే మండలి చైర్మన్ వెంటనే ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ స్థానం ఖాళీ అయిపోతుంది. రెండేళ్లకుపైగా పదవి కాలం ఉన్నందున ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహిస్తుంది. ఆ ఎన్నికలో కవిత పోటీ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ తక్కువగా ఉంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల బలాబలాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది. బీఆర్ఎస్ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చాలా వరకూ పార్టీలు మారిపోయారు. బీజేపీ కాంగ్రెస్‌లలో చేరిపోయారు.
బీఆర్ఎస్ ఓటర్లు అంతా చెల్లా చెదురు - కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడే అవకాశం
ఇప్పుడు స్థానిక సంస్థల ఉపఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ తన ఓటర్లను కాపాడుకోవడం చాలా కష్టం . అందుకే ఆ పార్టీకి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే కవిత రాజీనామా చేస్తే.. ఓ ఎమ్మెల్సీ స్థానం కోల్పోయినట్లు అవుతుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోరాటం జరిగితే.. బీఆర్ఎస్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. కవితకు ఎమ్మెల్సీ పదవి పోతుంది. దాని వల్ల బీఆర్ఎస్ కూ ఒరిగేదేమీ ఉండదు. ఇవన్నీ ఆలోచించి కవిత నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు.





















