Telangana : కాంగ్రెస్‌లో జగిత్యాల చిచ్చు- అభిమానులను గాంధీభవన్‌కు రావాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పిలుపు
MLC Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై జగిత్యాల ఎమ్మెల్సీ డీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యేని చేర్చుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే చేరిక చిచ్చుకు కారణం అవుతోందా..? అంటే అవునన్నా సమాధానమే ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే వినిపిస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, ఆదివారం రాత్రి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసింది.
గడిచిన కొన్నాళ్లుగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వస్తున్న జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరడం ఏమాత్రం నచ్చలేదు. పార్టీ తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఆయనను చేర్చుకుందంటూ ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన అసహనాన్ని బహిరంగంగానే వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సమావేశమైన తర్వాత అంతే స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తాను ఇన్నాళ్లపాటు ఎవరిపైన కొట్లాడానో వారిని తనకు మాట మాత్రం చెప్పకుండా పార్టీలో చేర్చుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని స్పష్టం చేసిన జీవన్ రెడ్డి.. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనస్థాపానికి గురై బాధపడుతున్నారన్నారు.
పార్టీలో ఎమ్మెల్యే చేరిన విషయాన్ని తాను పత్రికల్లో చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, తన 40 ఏళ్ల సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. కనీసం గౌరవం దక్కని పార్టీ తనకు ఎందుకని, ఈ ఎమ్మెల్సీ పదవి కూడా తనకు అవసరం లేదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో సంఖ్యా బలం పెంచుకోవడం కోసం ఏకపక్షంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని, కానీ, ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల మనోభావాలను గౌరవించకుండా ఉండడం తగదన్నారు. ఈ తరహా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. పోరాటాలు చేసిన నాయకులతో కలిసి పని చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా లేరని, వారు తీవ్రంగా బాధపడుతున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు.
గత రెండు ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాక బాధలో ఉన్న కార్యకర్తలను మరింత బాధపెట్టేలా ఈ తరహా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. పార్టీని బలోపేతం చేస్తున్నామంటూ నాలుగు దశాబ్దాల నుంచి ఇక్కడ పార్టీని నడిపిస్తున్న తనను అవమానించడం ఎంత వరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈ తరహా ఏకపక్ష నిర్ణయాలను పార్టీ కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ఆలోచనలు, సూచనలకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తన భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని, దానికి అనుగుణంగా ముందుకు వెళతానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుతం పార్టీలో జరిగిన పరిణామాలు పై కార్యకర్తలతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులను పార్టీలో చేర్చుకునేటప్పుడు ఆ ప్రాంతానికి చెందిన కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వారి మనోభావాలకు అనుగుణంగా నిర్ణయాలు లేకపోవడం పట్ల వారంతా ఆవేదనలో ఉన్నట్లు జీవన్ రెడ్డి వివరించారు.
మరోవైపు ఇవాళ గాంధీ భవన్‌కు రానున్న జీవన్ రెడ్డి తన అనుచరులను కూడా రావాలని పిలుపునిచ్చారు. అసలే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఢిల్లీ టూర్‌లో ఉన్నారు రేవంత్. ఇప్పుడు గాంధీ భవన్‌లో జీవన్ రెడ్డి ఏం చేస్తారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది.
2023 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన టి జీవన్ రెడ్డి పై 15, 822 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో జీవన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెలకొన్న పరిణామాలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు జీవన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చి ప్రయత్నం చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. లేదా ఆయన మరో పార్టీలో చేరే నిర్ణయం తీసుకుంటారా అన్నదానిపై ఒక రెండు రోజుల్లో స్పష్టత రానుంది.