(Source: ECI/ABP News/ABP Majha)
Telangana: హిమాన్షు మేజర్ కాగానే 36 ఎకరాలు రిజిస్ట్రేషన్, కేటీఆర్ అక్రమాస్తులకు అవే సాక్ష్యాలు: కేకే మహేందర్ రెడ్డి
Telangana News | తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆయన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు. ఈసారి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావుకు సంబంధించి కామెంట్ చేశారు.
KK Mahender Reddy allegations against KTR | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన ఆస్తులు భారీ స్థాయిలో పెరిగాయన్నారు. కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు మేజర్ కాగానే 36 ఎకరాల భూమిని అతడి పేరిట రిజిస్ట్రర్ చేశారని చెప్పారు. 2009 నుంచి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు మాజీ మంత్రి కేటీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఆ అఫిడవిట్లు, పెరిగిన ఆస్తులు గమనిస్తే కేటీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డారో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందన్నారు.
కేటీఆర్ అక్రమాస్తులకు అవే సాక్ష్యాలు
ముఖ్యంగా బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత 2018 నుంచి 2023 వరకు కేటీఆర్ అక్రమ సంపాదన ఆస్తులు ఊహించనంత పెరిగిందని ఆరోపించారు. విచ్చలవిడిగా దోచుకుంటూ, అక్రమాస్తులను కూడబెట్టారని ఎన్నికల అఫిడవిట్లతో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారని.. ఆయన సమర్పించిన డాక్యుమెంట్లే సాక్ష్యాలని మహేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మహేందర్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కేటీఆర్ చేతిలో ఓటమి చెందారు. కాగా, 2009 నుంచి పలుమార్లు సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి కేటీఆర్ చేతిలో ఓటమిపాలయ్యారు మహేందర్ రెడ్డి.
కేటీఆర్ ఏ అవినీతికి పాల్పడలేదంటే, కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. కేటీఆర్ అక్రమాస్తులపై తెలంగాణ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేయగా.. హైకోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు 4 వారాల నోటీస్ ఇచ్చిందని కేకే మహేందర్ రెడ్డి గుర్తుచేశారు. ఆ నోటీసుపై కేటీఆర్ తప్పక స్పందించి హైకోర్టుకు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు.
హిమాన్షు పేరిట భారీ ఆస్తులు అని ఆరోపణలు
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ తన కొడుకు హిమాన్షు రావును డిపెండెంట్‌గా చూపారని తెలిపారు. అయితే కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు మేజర్ అయిన కొన్ని రోజుల్లోనే తెలంగాణ పబ్లికేషన్స్‌కు చెందిన 36 ఎకరాల భూమిని అతడి పేరిట బదిలీ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పబ్లికేషన్స్ కు చెందిన భూమి విలువ దాదాపు రూ.1 కోటి ఉంటుందన్నారు. మేజర్ అయిన వెంటనే కుమారుడు హిమాన్షు రావు పేరిట కేటీఆర్ 36 ఎకరాల భూమిని రిజిస్టర్ చేశారా లేదా చెప్పాలని కేకే మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.