Karimnagar News: అమెరికాలో నీట మునిగి తెలంగాణ కుర్రాడు మృతి- స్పీడ్ బోట్ నడుపుతుండగా ప్రమాదం
అమెరికాలో స్పీడ్ బోటు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఫ్యామిలీ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది.
ఉన్నత విద్య అభ్యసించేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు స్పీడ్ బోటు ప్రమాదంలో మృతి చెందాడు. కరీంనగర్‌లోని సుభాష్ నగర్ చెందిన పాతికేళ్ల కంటె యశ్వంత్ కుమార్.. గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అమెరికాలోని పోలిడలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. వారాంతపు సెలవులు కావడంతో మిత్రులతో కలిసి ఆదివారం ఫ్లోరిడా సమీపంలోని ఓ ద్వీపానికి వెళ్లాడు. అక్కడ స్పీడ్ బోటులో విహారయాత్ర చేశారు.
విహార యాత్రలో విషాదం
విహారయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో యువకులు స్వయంగా నడుపుతున్న బోటు ఆగిపోయింది. అప్పుడు ఆ బోటులో యశ్వంత్‌తోపాటు మరో యువకుడు ఉన్నాడు. బోటు ఆగిపోయిందని తెలుసుకున్న ఇద్దరు కూడా దూకి ప్రాణాలు కాపాడుకుందామనుకున్నారు. అనుకున్నట్టుగానే తోటి యువకుడు ఈత కొడుతూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు. యశ్వంత్ మాత్రం సముద్రంలో చిక్కుకున్నాడు. బయటకు రాలేకపోయాడు. సముద్రంలో మునిగిపోయిన యశ్వంత్ మృత దేహం సోమవారం సాయంత్రం బయటపడింది.
సోమవారం మృతదేహం లభ్యం
ప్రమాదం జరిగిన వెంటనే విషయాన్ని ఫ్యామిలీకి చేరవేశారు యశ్వంత్ ఫ్రెండ్స్. గల్లంతైన యశ్వంత్ కోసం వెతుకుతున్నాని చెప్పారు. సోమవారం సాయంత్రానికి యశ్వంత్ చనిపోయినట్టు సమాచారం అందించారు. మృతదేహం కూడా లభించిందని తెలిపారు. యశ్వంత్ మరణ వార్త విన్న కన్నవారు బోరున విలపిస్తున్నారు. యశ్వంత్ తండ్రి మల్లేశం చందుర్తిలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈ వార్త యశ్వంత్ ఫ్యామిలీలోనే కాదు కరీంనగర్‌లోని తీవ్ర విషాదం నింపింది.
జర్మనీలో గతంలో ఇలాంటిదే
ఈ మధ్య ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల కాలంలో జర్మనీలో కూడా వరంగల్‌కు చెందిన కుర్రాడు మృతి చెందాడు. ఇలానే ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్లిన అఖిల్ అనే పాతికేళ్ల కుర్రాడు పడవ ప్రమాదంలో మృతి చెందాడు. కెమికల్ ఇంజనీరింగ్ అయిన వరంగల్‌కు చెందిన కడారి అఖిల్(25) జర్మనీలో ఎంఎస్ చదివేందుకు 2018లో వెళ్లాడు. మే 8న జరిగిన పడవ ప్రమాదంలో అఖిల్ గల్లంతయ్యాడు. మంత్రి కేటీఆర్ విషయం తెలుసుకొని అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేశారు.