Bandi Sanjay: ‘బీఆర్ఎస్ ఒక వైరస్ - బీజేపీ ఒక వ్యాక్సిన్’ ఇక మీరే తేల్చుకోండి - బండి సంజయ్
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తుర్గాసి పల్లి శిబిరం వద్ద ప్రెస్ మీట్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
‘బీఆర్ఎస్ ఒక వైరస్.. బీజేపీ ఒక వ్యాక్సిన్’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అభివర్ణించారు. వైరస్ కావాలా వ్యాక్సిన్ కావాలా ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. తనను ప్రశ్నిస్తూ ఏర్పాటు అయిన ఫ్లెక్సీలపై బండి సంజయ్ స్పందించారు. ఎంపీగా తాను ఏం చేయాలో చేస్తున్నానని, ముందు మీరేం చేశారో చెప్పాలని అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తుర్గాసి పల్లి శిబిరం వద్ద ప్రెస్ మీట్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు లాగే అధికార పార్టీపై బండి సంజయ్ మండిపడ్డారు. ‘‘నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులను ఎందుకు పట్టించుకోవడం లేదు? కొండగట్టు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదు? బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దు. మేము ఫ్లెక్సీలు పెట్టడం మొదలుపెడితే మీరు ముఖం కూడా ఎత్తుకోలేరు. తెలంగాణ ప్రభుత్వం మారాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. పైలట్ రోహిత్ రెడ్డితో హడావుడిగా ఎందుకు స్టేట్‌మెంట్ ఇప్పించారో సీఎం చెప్పాలి. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేస్ వ్యవహారాన్ని విడిచిపెట్టబోం’’
తన ఎమ్మెల్యేలు కొందరు చేసిన తప్పుల చిట్టాను తన దగ్గర పెట్టుకొని వారిని సీఎం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నయీమ్ కేసు డ్రగ్స్ కేసులు వంటి వాటిపై గతంలో వేసిన సిట్ నివేదికలు ఏమయ్యాయి? ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నావ్’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.
బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
మరోవైపు, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. సంజయ్ పాదయాత్ర చేస్తున్న మార్గంలో ఆయనకు వ్యతిరేకంగా కొందరు గుర్తు తెలియని టీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని పలు జంక్షన్లలో ఈ ఫ్లెక్సీలు పెట్టారు. గత 8 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఏం చేసిందంటూ ఆ ఫ్లెక్సీల్లో ఉంది.
గడచిన ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధికి చేసిందేమిటో కరీంనగర్ పార్లమెంట్ రైతులకు చెప్పు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క సాగునీటి ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకువచ్చావా? ఇక్కడి అన్నదాతలకు వివరించు’’ అంటూ వెదిర గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘దేవాలయాల అభివృద్ధిలో నీ పాత్ర ఏంటో చెప్పు? ధర్మపురి, వేములవాడ, కాళేశ్వరం, కొండగట్టు దేవాలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరు చేయించారో ఇక్కడి భక్తులకు చెప్పు. వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమిటి?’’ అని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ముగింపునకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత ప్రజాసంగ్రామయాత్ర ఈరోజు గంగాధర నుండి మొదలై కొత్తపల్లి వరకు కొనసాగనుంది. ఇందులో నారాయణపూర్ చెరువు ముంపు గ్రామాల బాధితుల సమస్యలు వినడంతోపాటు.. వివిధ వర్గాల ప్రజలతో బండి సంజయ్ మమేకం కానున్నారు. ఈ పాదయాత్రలో బండి సంజయ్ కురిక్యాల, కోట్ల నరసింహుల పల్లె, కొండన్నపల్లి, దేశరాజు పల్లి, వెదిర మీదుగా కొత్తపల్లి చేరుకోనున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయిదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటితో ముగియనుండడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకులు కరీంనగర్ కి చేరుకుంటున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభకు హాజరు కానుండడంతో భారీ జన సమీకరణ చేసి సక్సెస్ చేయడం ద్వారా టిఆర్ఎస్ కి సవాల్ విసరాలనీ బిజెపి భావిస్తోంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ముగింపు సభ జరగనుంది.