Ponnam Prabhakar: పొన్నం ప్రభాకర్ పాదయాత్రలో ఏఐసీసీ కార్యదర్శి
Ponnam Prabhakar: కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాదయాత్రకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పూర్తి మద్దతు వస్తోంది. పొన్నం పాదయాత్రలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొని మద్దతు తెలిపారు.
Ponnam Prabhakar: కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్రకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తోంది. శంకరపట్నం మండలంలో కొనసాగిన పాదయాత్రలో ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ ఇన్ ఛార్జీ రోహిత్ చౌదరి పాల్గొన్నారు.
పొన్నంపై ప్రశంసలు
కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపుతూ.. ప్రజలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పట్ల అవగాహన కల్పిస్తున్న పొన్నం ప్రభాకర్ ను ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ప్రశంసించారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీని మరింత చేరువ చేస్తున్న పొన్నం ప్రభాకర్ ను ఆయన పొగిడారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి... అటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న కుట్ర పూరిత విధానాల వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆయన తీవ్రంగా విమర్శించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
సామాన్య ప్రజలు కాంగ్రెస్ వైపే ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. ఒక వైపు తమ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే... టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వలేని సీఎం చంద్రశేఖర్ రావు తన కుటుంబంలో మాత్రం అందరికీ పదవులు ఇచ్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని.. ఈ సారి వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని విమర్శించారు. అవినీతితో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయాలనే కోరికతో ప్రజలు ఉన్నారని అన్నారు. సర్వేలు కూడా తమకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అవసరాలు తీరాక సొంత లాభం కోసం ఇతర పార్టీలోకి వెళ్లడానికి నిర్ణయించుకుని పార్టీకి రాజీనామా చేశాడని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వాలపై పొన్నం ప్రభాకర్ మాటల దాడి
మరోవైపు అసలైన ఎన్నికలకు సంవత్సరం దూరంలో ఉన్న ఈ సమయంలో బీజేపీ చేస్తున్న అనైతిక రాజకీయాల వల్ల మళ్లీ దాదాపు 12 చోట్ల ఉపఎన్నికలు వస్తాయని... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనడంపై పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ఈ ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నారా.. అని పొన్నం ప్రశ్నించారు. ప్రజాస్వామ్య స్పూర్తికి వ్యతిరేకంగా అధికార పార్టీలోని నేతలను బీజేపీ బుట్టలో వేసుకొని ఉపఎన్నికలను తేవడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వైపు అధికారం ఆశించకుండా తాము ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ నిజాయితీగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలపడమే కాకుండా, స్వయంగా పోరాడమని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ విషయం పట్ల ప్రజలందరికీ స్పష్టమైన అవగాహన ఉందని ఆయన అన్నారు. మరో వైపు పొన్నం పాదయాత్రలో ఆయనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పాల్గొని మద్దతు తెలిపారు.