Karimnagar News : కరీంనగర్ జిల్లాలో విషాదం, బావిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్, రైతు మృతి
Karimnagar News : దళిత బంధు స్కీంలో ట్రాక్టర్ మంజూరైందని ఆనందించిన ఆ కుటుంబంలో అంతలోనే విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ నేర్చుకుంటూ వ్యవసాయ బావిలో పడి రైతు మృతి చెందాడు.
Karimnagar News : అతనొక నిరుపేద. ఎన్నో ఏళ్లుగా కష్టాలతో సహజీవనం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీమ్ ద్వారా అతనికి ఒక ట్రాక్టర్ మంజూరు అయింది. ట్రాక్టర్ నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ విషాద సంఘటన కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండలంలోని మహాత్మా నగర్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే మాన కొండూరు మండలం బంజరు పల్లె గ్రామానికి చెందిన కాంపల్లి శంకర్ పాలెరు పని చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. శంకర్ కు భార్య లక్ష్మి ఇద్దరు కూతుళ్లు పూజ, అంజలి ఉన్నారు. అంజలి ఇటీవలనే డిగ్రీ పూర్తి చేయగా పూజ తన తల్లికి పనుల్లో చేదోడువాదోడుగా ఉండేది.
దళిత బంధు స్కీంలో ట్రాక్టర్ మంజూరు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన దళిత బంధు స్కీం కింద శంకర్ కు ఓ ట్రాక్టర్ మంజూరైంది. దీనిని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గత నెల ఆరో తారీఖున అందజేశారు. ఇక తమ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని సంతోషపడ్డారు. అయితే శంకర్ కు డ్రైవింగ్ రాకపోవడంతో నేర్చుకోవాలని అనుకున్నాడు. తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ కు చెందిన మల్లేశం అనే అతన్ని సంప్రదించగా అందుకు ఒప్పుకున్నాడు. దీంతో ఒక రైతుకు చెందిన వ్యవసాయ భూమి వద్ద మల్లేశం శంకర్ కు ట్రాక్టర్ నేర్పిస్తుండగా అదుపుతప్పింది. ట్రాక్టర్ స్పీడ్ గా దూసుకెళ్లి వ్యవసాయ బావిలో పడిపోయింది.
బావిలో మునిగిపోయిన ట్రాక్టర్
అయితే మల్లేశానికి ఈత రావడంతో బావి నుంచి బయటపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన పశువుల కాపరి పక్కనున్న రైతులందరికీ సమాచారం అందించాడు. కానీ అప్పటికే బావిలో ట్రాక్టర్ తో సహా శంకర్ మునిగిపోయాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహం కోసం గాలించారు. క్రైన్ తెప్పించి ట్రాక్టర్ ను బావిలోంచి బయటకు తీశారు. చివరకు శంకర్ మృతదేహాన్ని బయటకు తీసి బంధువులకు అందించారు. ఆర్థిక సమస్యలు పోయి జీవితంలో కుదురుకుంటున్న సమయంలో కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Also Read : Jagtial News : తెలంగాణలో గల్ఫ్ గోసలు, తండ్రి మృతదేహం కోసం 108 రోజుల పాటు పడిగాపులు కాసిన కుటుంబం!
Also Read : Hayath Nagar Crime : హయత్ నగర్ లో మరోసారి చెడ్డీ గ్యాంగ్ అలజడి, గేటెడ్ కమ్యూనిటీలో చోరీ