Jagtial News : తెలంగాణలో గల్ఫ్ గోసలు, తండ్రి మృతదేహం కోసం 108 రోజుల పాటు పడిగాపులు కాసిన కుటుంబం!
Jagtial News : ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్లిన ఓ కార్మికుడు అనుకోని రీతిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు 108 రోజుల పాటు కష్టబడ్డారు.
Jagtial News : ఎవరైనా చివరి చూపు కోసం రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఎదురు చూస్తారు. మరీ దూర ప్రాంతాల్లో ఉండి రావడానికి వీసా ఇమ్మిగ్రేషన్ తదితర సమస్యలు ఉంటే వారం పది రోజులు పడుతోంది. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం తమ ఆత్మీయుడి మృతదేహం కోసం 108 రోజులుగా కన్నీటితో ఎదురుచూశారు. కడసారి చూపు కోసం ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. గల్ఫ్ దేశం నుంచి తమ ఆత్మీయుడి మృతదేహం కోసం 108 రోజులు ఎదురుచూశారు. చివరికి 6 జులై 2022 స్వగ్రామానికి చేరిన మృతదేహాన్ని అంతిమసంస్కారాలు నిర్వహించారు బంధువులు.
గల్ఫ్ గోసలు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాస్(37) అనే ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. సౌదీలో అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కున్నాడు. తనపై అక్రమ కేసు బనాయించారని భయాందోళనకు గురైన శ్రీనివాస్ ఇంటికి చేరుకోలేనేమో అనే మనోవేదనతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో కువైట్, ఒమన్ దేశాల్లో పనిచేసిన శ్రీనివాస్ చివరకు సౌదీ వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య లక్ష్మి(36), కుమార్తెలు అనూష (19), అంజలి (16), కుమారుడు గణేష్ (11) లతోపాటు తల్లి వెంకటమ్మ (56) ఇతనిపై ఆధారపడి ఉన్నారు.
అసలేం జరిగింది?
శివరాత్రి శ్రీనివాస్ సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో ఒక అరబ్బు యజమాని వద్ద హౌస్ డ్రైవర్ గా పనిచేసేవాడు. కరోనా కాలంలో పనిలేదు. తర్వాత కడుపులో అల్సర్ నొప్పికి ఆపరేషన్ చేయించుకున్నాడు. అతడి ఆరోగ్యం కుదుట పడకముందే యజమాని ఖర్జూరపు చెట్లు ఎక్కి పండ్లు కోసే పనులు చేయించాడు. సరైన విశ్రాంతి లేకపోవడం, యజమాని హింసలు భరించలేక శ్రీనివాస్ తన యజమాని నుంచి 400 కి.మీ దూరంలోని దమ్మామ్ ప్రాంతానికి పారిపోయాడు. ఇలా యజమాని నుంచి అనుమతి లేకుండా వెళ్లిపోవడాన్ని 'ఖల్లివెల్లి' అంటారు. తన నుంచి పారిపోయాడనే కోపంతో అరబ్బు యజమాని శ్రీనివాస్ పై ఏదో వస్తువు దొంగిలించాడని 'మత్లూబ్' అనే క్రిమినల్ కేసు పెట్టాడు. అక్రమ కేసులు పెట్టారని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.
'హురూబ్' 'మత్లూబ్' అంటే ఏమిటి ?
సౌదీ అరేబియాలో 'కఫీల్' (స్పాన్సర్ / యజమాని)కు సమాచారం ఇవ్వకుండా ప్రవాసి ఉద్యోగి పనికి గైరుహాజరు కావడం, పారిపోవడాన్ని అరబ్బీలో 'హురూబ్' (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి) అంటారు. సౌదీ చట్టాల ప్రకారం ఉద్యోగి పారిపోయిన సందర్భాలలో యజమాని 'జవజత్' (పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖ) అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రవాసి ఉద్యోగిని 'హురూబ్' గా ప్రకటిస్తారు. కొందరు యజమానులు పారిపోయిన ఉద్యోగులపై దొంగతనం, ఆస్తి నష్టం లాంటి 'మత్లూబ్' (వాంటెడ్ బై పోలీస్) అనే కేసు నమోదు చేస్తుంటారు. దురుద్దేశం కలిగిన కొందరు 'కఫీల్లు' పారిపోయిన ఉద్యోగులను పీడించడానికి 'మత్లూబ్' వ్యవస్థను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఉద్యోగులకు సరైన భోజనం, వసతి లేకపోవడం, వేతనాలు చెల్లించకపోవడం, అధిక పనిగంటలు, యజమాని సెలవు మంజూరు చేయకపోవడం, యజమాని వేధింపులు, హింసలను, అమానవీయ ప్రవర్తన తట్టుకోలేక పారిపోతుంటారు. 'మత్లూబ్' (పోలీస్ కేసు) ఉన్నవారికి ముందున్నవి రెండు మార్గాలు. యజమాని కేసు వాపస్ తీసుకోవడం లేదా పోలీసుల ముందు లొంగిపోయి న్యాయపోరాటం చేయడం. రియాద్ లోని ఇండియన్ ఎంబసీ, జిద్దాలోని ఇండియన్ కాన్సులేట్ కార్మికులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) అందిస్తుంది. అయినా కార్మికులు న్యాయపోరాటం చేయడం అంత సులువు కాదు.
ప్రభుత్వం ఆదుకోవాలి
శ్రీనివాస్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని కోరుతున్నారు. సౌదీ నుంచి మృతదేహాన్ని ఇండియాకు తప్పించడానికి కృషిచేసిన పలువురికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వారంతా స్వచ్ఛందంగా పనిచేయడం వల్లే ఆ కుటుంబానికి ఆఖరి చూపు అయినా దక్కిందన్నారు.