Bandi Sanjay : బ్యాట్ పట్టిన బండి సంజయ్, క్రీడలు మానసిక ఉల్లాసం కోసమేనని వ్యాఖ్యలు
Bandi Sanjay : బండి సంజయ్ సరదాగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. బీజేపీ శ్రేణులు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలను బహుమతులు అందజేశారు.
Bandi Sanjay : ఎప్పుడు రాజకీయాలతో బిజీగా ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యువకులతో కలిసి క్రికెట్ ఆడారు. కరీంనగర్ లో నిర్వహించిన పోటీల్లో సరదాగా బ్యాట్ పట్టి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని, బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణం కోతి రాంపూర్ గిద్ద పెరుమాండ్ల దేవాలయ గ్రౌండ్లో రెండు రోజులుగా జరుగుతున్న క్రీడా పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. క్రీడా కార్యక్రమం ముగింపు, బహుమతి ప్రధానోత్సవానికి బండి సంజయ్ హాజరయ్యారు. క్రికెట్ క్రీడలో గెలుపొందిన జట్టుకు, రన్నర్ జట్టు , బెస్ట్ బ్యాట్స్ మెన్, బెస్ట్ బౌలర్ లకు మెమొంటోలు, ట్రోఫీలు అందజేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ క్రీడల్లో పాల్గొన్న శ్రేణులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. క్రీడల్లో కానీ రాజకీయాల్లో గాని గెలుపోటములు సహజమన్నారు. వాటిని స్వీకరించే విధానం బట్టే మనం ముందుకు కొనసాగి ఏదైనా సాధించగలుగుతామన్నారు.
అనునిత్యం పోరాటం
ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంతో బీజేపీ శ్రేణులు అనునిత్యం పోరాటం చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఎంతో ఒత్తిడిని భరిస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి బీజేపీ శ్రేణుల మానసిక ఉల్లాసానికి బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జరిగిన క్రికెట్ పోటీలలో జిల్లా బీజేవైఎం జట్టు గెలుపొందగా, ప్రెసిడెంట్ లెవెల్ జట్టు రన్నర్స్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కళ్లెం వాసుదేవ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో సంక్రాంతి సంబరాలు
వైజాగ్ పాండు రంగపురం బీచ్ రోడ్ లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భోగి మంటలు వేశారు. ఈ సంబరాల్లో గంగిరెద్దు ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ... విశాఖ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారి పండగల్లో సంక్రాంతి పండుగ ముఖ్యమైనదన్నారు. ప్రాచీన కాలం నుంచీ ప్రముఖంగా జరిగే పండగల్లో సంక్రాంతి ఒకటన్నారు. సమాజానికి సంస్కృతి సంప్రదాయాలను తెలిపే విధంగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలంతా సంతోషకరంగా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేస్తామన్నారు. గ్రామాలకు ధీటుగా ఉండాలనే సంకల్పంతో విశాఖ నగరంలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశామన్నారు. తరువాత ఎంపీ జీవీఎల్, మైథిలీ దంపతులు, వారి కుమారుడు విఘ్నేశ్వర పూజ, లక్ష్మీ పూజలు నిర్వహించారు. అనంతరం కోలాటం కళాకారులతో కలిసి ఎంపీ దంపతులు బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా నృత్యం చేయడంతో ఈ ప్రాంతం అంతా కోలాహంగా మారింది. అలాగే హరిదాసులు సందడి చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు, తప్పెట గుళ్లు ఆకట్టుకున్నాయి. అనంతరం ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు.