Kakatiya Dynasty Intelligence: కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థకు అడ్డా - రింగున్ గుట్ట! వారి గొప్పతనం ఇదీ
Kakatiya Dynasty History: విదేశీయుల దాడులు పెరిగిపోతున్న కాలంలోనూ కాకతీయులు ధైర్యంగా తమ రాజ్యాన్ని ఎలా కాపాడుకోగలిగారు. అందుకు లభించే సమాధానమే కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థ.
History Of Kakatiya Dynasty: ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ మహాస్రామజ్యం మూడొందల ఏళ్ల పాటు ప్రజారంజక పాలనను అందించింది. మన దేశంపై విదేశీయుల దాడులు పెరిగిపోతున్న కాలంలోనూ కాకతీయులు అంత ధైర్యంగా తమ రాజ్యాన్ని ఎలా కాపాడుకోగలిగారు. ఇదే చరిత్రకారులను ఆశ్చర్యంలో పడేసే విషయం. అందుకు లభించే సమాధానమే కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థ.
కాకతీయుల రక్షణ వ్యవస్థ ఆనవాళ్లు..
రాజ్యాలను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు రాజులు అహర్నిశలూ పాటుపడేవారు. ఇందుకోసం సరిహద్దులు, గుట్టలు, కొండలపై సైనిక, గూఢచార స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. కాకతీయుల పాలనలోనూ ఇలాంటి నిర్మాణాలకు కొదువలేదు. కాకతీయులు పటిష్టమైన భద్రత వ్యవస్థ గూడచార వ్యవస్థను అనుసరిస్తూ 300 సంవత్సరాలు పాలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాకతీయుల రక్షణ వ్యవస్థ ఆనవాళ్లకు సాక్ష్యాలలో రింగున్ గుట్ట ఒకటి.
నాలుగు గుట్టలే కాకతీయులకు ఇంటెలిజెన్స్..
కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా వరంగల్ నగరం కొనసాగింది. వరంగల్ చుట్టూ అనేక ప్రాంతాల్లో కాకతీయులు రక్షణ కోటలను, స్థావరాలను నిర్మించుకున్నారు. రాజులు అంతరించిపోయినా వారి రాజ్యాల ఆనవాళ్లు, కట్టడాలు ఇప్పటికి దర్శనమిస్తూనే ఉంటాయి. మరి అంతటి మహాసామ్రాజ్యానికి ఆయువుపట్టు లాంటి ఇంటిలిజెన్స్ వ్యవస్థకు కేంద్రం ఏంటో తెలియాలంటే కోట గోడలను దాటి రావాల్సిందే. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట లో నాలుగు గుట్టలే కాకతీయుల ఇంటెలిజెన్స్ వ్యవస్థకు హెడ్ క్వార్టర్స్. శిథిలమైపోయి చూడటానికి నాటి ఆనవాళ్లు తప్ప మరేమీ మిగలని ఈ గుట్ట ప్రాంతాలే నాటి కాకతీయుల గూడఛార వ్యవస్థకు నిలయాలు.
కట్టుదిట్టమైన గూఢచార వ్యవస్థ..
రింగున్ గుట్టపై కాకతీయుల గూఢచార వ్యవస్థకు కేందంగా రింగున్ గుట్ట ఉండేది. కాకతీయుల గూఢచార వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండేది అనడానికి రింగున్ గుట్ట నిదర్శనం. రింగున్ గుట్టపై సైనిక స్థావరం, సైనికులకు కావలిసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇక్కడే తయారయ్యేది. రింగున్ గుట్ట నుంచి నరసింహారావు పేట చుట్టూ పక్కల ప్రాంతాల నిఘా వ్యవస్థ ఇక్కడ నుంచే జరిగేది. కాకతీయులు రక్షణ వ్యవస్థకు, సైనిక స్థావరాలకు నిటారుగా ఉండేగుట్టలను ఎంచుకునేవారు. అందుకు నిదర్శనమే రింగున్ గుట్ట. ఈ గుట్ట కూడా నిటారుగా ఉంటుంది. శత్రువులు సులువుగా సైనిక స్థావరంపైకి దంక్సత్తకుండా, దాడులు చేయకుండా ఈ నిటారు గుట్టలను ఎంచుకున్నారు. ఈ గుట్టలపైకి వెళ్లేందుకు సామాన్యంగా ఎవరూ సాహసించరు. నిటారుగా ఉన్న పెద్ద బండరాళ్లపై నుంచి గుట్టలపైకి చేరుకొని అక్కడి కాకతీయుల అనవాళ్లను చూడవచ్చు. గుట్టపై నాలుగెకరాల విస్తీర్ణంలో కోట నిర్మాణ ఆనవాళ్లు సజీవ సాక్షంగా ఉన్నాయి. నాలుగు వైపులా ద్వారాలు, చుట్టూ ప్రహరీ నిర్మాణం సజీవ సాక్షిగా కనిపిస్తున్నాయి. రెండు ద్వారాలు పూర్తిగా శిథిలమయ్యాయి.
రింగున్‌గుట్టపైనా ఒక కోనేరు ఉంది. కాకతీయులు శివారాధకులు వారు ఎక్కడ వారాయి స్థావరాలను ఏర్పరచుకున్న అక్కడ శివాలయాన్ని నిర్మించుకునేవారు. ఈ ఊరిలోని శ్రీవేంకటేశ్వరస్వామి గుట్ట, నరసింహస్వామి గుట్ట, అడ్డగుట్ట ప్రధానమైన రింగున్ గుట్టలే నాలుగు స్తంభాలుగా కాకతీయ మహాసామ్రాజ్యాన్ని అన్ని వందల ఏళ్లపాటు కంటికి రెప్పలా కాచుకున్నాయి. శిథిలావస్థలో ఉన్న శివాలయంలో వినాయకుడి విగ్రహం, శిథిలమైన నంది విగ్రహం, రాతిపై అశోకచక్రం ఇప్పటికీ కనిపిస్తున్నాయి. వీటితో పాటు పెద్ద బావి, దానికి సమీపంలో రాతి స్తంభాలున్నాయి. నర్సింహులపేట గుట్టలపై కాకతీయ రాజులు సేనలను ఉంచి, గూఢచార వ్యవస్థ నడిపేవారని ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణాలు చెబుతున్నాయి.
గుట్టల కింది భాగంలో అప్పట్లో పెద్ద గ్రామం ఉండేదని, ఇప్పటికీ రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు పెంకులు, రాతి వస్తువులు బయట పడుతుంటాయని గ్రామస్తులు చెబుతుతుంటారు. రింగున్ గుట్టతోపాటు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనరసింహస్వామి కొలువైన గుట్టలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని గ్రామస్తులు చెబుతున్నారు.
కాకతీయ సామ్రాజ్యంలో అనేక ప్రాంతాల్లోని కట్టడాలు వారి పాలనకు ఆనవాళ్లుగా ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సుమారు 300 సంవత్సరాలు పాలించిన కాకతీయులు వారి సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి గూఢచార వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. విదేశీ దాడుల సమయంలోనూ ధైర్యంగా పాలించారని చెప్పడానికి వారి గూఢచార వ్యవస్థనే కారణమని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శేషు చెప్పారు. కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత ఈ గుట్టలు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని ఆలయాల నిర్మాణాలు మాత్రం నాటి రక్షణవ్యవస్థకు గుర్తుగా మిగిలి ఉన్నాయి.