Maganti Gopinath : జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు తీవ్ర అస్వస్థత - చికిత్సకు స్పందిస్తున్నారంటున్న వైద్యులు
Jubilee Hills MLA: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు.

Jubilee Hills MLA Maganti Gopinath : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఆయనను ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన చాలా కాలంగా కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కు కిడ్నీ సమస్యలు ఉన్నాయి. సమస్యను నిర్లక్ష్యం చేయడంతో పెరిగి పెద్దదయిపోయింది. ఫిబ్రవరిలో తీవ్ర అనారోగ్యం ఏర్పడటంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు.
కిడ్నీ సమస్యలతో బాధపడ్డ మాగంటి గోపీనాథ్
ఏఐజీలో మాగంటి గోపీనాథ్ ను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రెండు సార్లు పరామర్శించారు. ఆయనకు విదేశీ వైద్యం చేయించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అయితే వైద్యులు పరిస్థితి చేయి దాటిపోయిందని చెప్పారు. గత ఫిబ్రవరి నుంచి ఆయన ప్రాణం కాపాడటానికి విదేశీ వైద్యుల సలహాలతో చాలా ప్రయత్నాలు చేశారు. . ఈ ఉదయం పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు బీఆర్ఎస్ నేతలకు సమాచారం ఇచ్చారు. హరీష్ రావుతో పాటు ఇతర సీనియర్ నేతలు ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. అయితే ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని.. వైద్యులు తమ ప్రయత్నం తాము చేస్తున్నారని అంటున్నారు.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు విద్యార్థి, యువనేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ
మాగంటి గోపీనాథ్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు నిండా ముఫ్పై ఏళ్లు నిండక ముందు టీడీపీ రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్ లో ఆయన ప్రముఖ నేతగా ఎదిగారు. యువ నేతగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2014లో ఆయనకు మొదటి సారిగా టీడీపీ టిక్కెట్ జూబ్లిహిల్స్ నుంచి లభించింది. ఆ ఎన్నికల్లో ఆయన పది వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి మళ్లీ 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. జూబ్లిహిల్స్ నుంచి గత ఎన్నికల్లో అజరుద్దీన్ పై విజయం సాధించారు.
మూడో సారి గెలిచిన తరవాత అనారోగ్యంతో రాజకీయాలకు దూరం
ఈ మధ్య కాలంలో గోపీనాథ్ పెద్దగా రాజకీయ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ మంచి విజయాలు సాధించింది.దాదాపుగా అన్ని చోట్లా గెలిచింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో పార్టీ బలోపేతం కోసం ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే అనారోగ్యం కారణంగా చురుకుగా పాల్గొనలేపోయారని భావిస్తున్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అందుకే వరుసగా గెలుస్తూ వస్తున్నారని చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ ఎవరితోనూ పరుషంగా మాట్లాడే వ్యక్తి కాదని అంటున్నారు.





















