KTR Chit Chat : జానారెడ్డి కన్నా ఈటల పెద్ద లీడరా ? 9 నెలలు పార్టీ పని మీదే ఉంటామన్న కేటీఆర్ !
9 నెలల పాటు టీఆర్ఎస్ కార్యక్రమాలు ఉంటాయని కేటీఆర్ ప్రకటించారు. హుజురాబాద్‌లో రేవంత్, ఈటల కుట్ర చేస్తున్నారని అయినా టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో చిట్‌చాట్‌గా మీడియాతో మాట్లాడారు.
వచ్చే తొమ్మిది నెలల పాటు టీఆర్ఎస్‌కు సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు చేపడతామని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. వరంగల్‌లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభ సన్నాహాకాల్లో భాగంగా ప్రతి రోజు 20 నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పలు అంశాలపై తన అభిప్రాయాలను వివరించారు.
నవంబర్ 15న ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి !
ఇంత కాలం ప్రభుత్వంపై దృష్టి పెట్టడం వల్ల పార్టీ కార్యక్రమాలు తగ్గాయని .. ఇక నుంచి పార్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ నెల 24 న తెలంగాణ భవన్ లో ఉంటుందని.. 25న ప్లీనరీ ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ విజయ గర్జన సభ విజయవంతం చేసేందుకు నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు పెడతామన్నారు. వరంగల్ లో ఎన్నో సభలు పెట్టి విజయవంతం చేశామని గుర్తు చేశారు. ఆరు వేల బస్సులతో పాటు 16 వేల యూనిట్ల నుంచి వాహనాల్లో సభకు జనం వస్తారని కేటీఆర్ అంచనా వేశారు. నవంబర్ 15న సభ సందర్భంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుందని.. ఆరోజు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Also Read : కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?
జానారెడ్డినే ఓడించాం.. ఆయన కంటే ఈటల పెద్ద లీడరా ?
హుజురాబాద్ లో వంద శాతం విజయం సాధిస్తున్నామని.. నాగార్జున సాగర్ లో జానా రెడ్డి నే ఓడించాం. రాజేందర్ అంతకన్నా పెద్ద లీడరా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీని ఈటల ఈటల బీజేపీ ని సొంతం చేసుకోవడం లేదన్నారు. బీజేపీ అంటే ఓట్లు పడవనే ఈటల ఆ పార్టీ పేరు ఎత్తడం లేదా అని ప్రశ్నించారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంతో చేసిందన్నారు. రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పడం లేదని.. .గెలిస్తే ఏం చేస్తాడో కూడా చెప్పడం లేదన్నారు ఈటల, రేవంత్ కుమ్మక్కయ్యారని.. కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు కానీ రేవంత్ ముందస్తు ఎన్నికల గురించి చిలక జోస్యం చెబుతున్నాడని మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు అయ్యాక తనను తాను నిరూపించుకోవాలి కదా.. ఎందుకు హుజురాబాద్ వెళ్లడం లేదని రేవంత్‌ని ప్రశ్నించారు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న సన్నాసి చేయలేదని విమర్శించారు.
టీఆర్ఎస్‌పై రేవంత్, ఈటల కుట్ర చేస్తున్నారు !
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమేనని.. పశ్చిమ బెంగాల్ లో మమత గెలిస్తే మోడీ దుప్పటి కప్పుకుని పడుకున్నాడా అని ప్రశఅనించారు. తాను గెలిస్తే కెసీఆర్ అసెంబ్లీ కి రావద్దని రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని..మండిపడ్డారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం సమయం సందర్భాన్ని ఉంటుందని .. తాను వేరే వారి లాగా చిలుక జోస్యం చెప్ప లేననని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఉద్యమ కారులు అసంతృప్తిగా ఉంటే ఇన్ని ఎన్నికల్లో టీ ఆర్ ఎస్ ఎందుకు గెలుస్తుందని ప్రశ్నించారు. హుజురాబాద్ ప్రచారానికి కాను వెళ్లడం లేదని..నాగార్జున సాగర్ దుబ్బాక కు కూడా వెళ్ళలేదని గుర్తు చేశారు. సీఎం ప్రచారం కూడా ఇంకా ఖరారు కాలేదన్నారు. రేవంత్, ఈటల తదితరులు టీ ఆర్ ఎస్ పై కుట్ర కు తెరలేపారు.. ఓ కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈటెల కు ఓటయ్యాలని లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. హుజురాబాద్ కచ్చితంగా చిన్న ఎన్నిక అని తేల్చేశారు. టీ ఆర్ ఎస్ విజయాలు మీడియా కు కనిపించవన్నారు.
Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
ఈటల, వివేక్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారు !
ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారని కేటీఆర్ జోస్యం చెప్పారు. అలాగే మాజీ ఎంపీ వివేక్‌ను కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని వినిపిస్తోందన్నారు. ఇటీవల వివేక్‌తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారన్న ప్రచారం కారణంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేరే చేయడంలో వివేక్ కీలక పాత్ర పోషించారు.
కేసీఆర్ ఉపరాష్ట్రపతి వాట్సాప్ యూనివర్శిటీ ప్రచారం !
డీఎంకే పార్టీ నిర్మాణాన్ని పరిశీలించేందుకు నవంబర్ 15 తర్వాత చెన్నై వెళ్తామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమనేనన్నారు. టీ ఆర్ ఎస్ లో నియోజక వర్గాల్లోగ్రూపులు పార్టీ బలంగా ఉందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నియోజక వర్గ నేతలతో జరుగుతున్న మీటింగుల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ను కేసీఆర్ కు తెలియజేస్తాన్నారు. నీట్ రద్దు చేయాలని వస్తున్న డిమాండ్ పై భిన్నాభిప్రాయాలున్నాయి. మన విద్యార్థుల ప్రయోజనాల రీత్యా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి