Hyderabad Accidents : యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయి...తీవ్రత పెరుగుతోంది ! హైదరాబాద్ రోడ్ టెర్రర్‌లో ఎన్నో తెలియని విషయాలు...
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. వాస్తవంగా అయితే ప్రమాదాల సంఖ్య తగ్గుతోంది. కానీ తీవ్రత పెరగడం వల్ల బాధితుల సంఖ్య పెరుగుతోంది.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా... ఎన్ని సంస్కరణలు అమలు చేసినా ప్రమాదాలను మాత్రం పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారు. వంద వందశాతం తగ్గించడం ఎవరికీ సాధ్యం కాదు కానీ అతి భారీ ప్రమాదాల్ని.. ప్రాణ నష్టం కలిగించే ప్రమాదాల్ని నియంత్రించడానికి అవకాశం ఉంది. కానీ కొంత మంది వాహనదారుల నిర్లక్ష్యం... మరి కొంత మంది మద్యం మత్తులో విచ్చలవిడి డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అమాయకులు బలవుతున్నారు. మూడు రోజుల కిందట జరిగిన రెండు ప్రమాదాలే దీనికి సాక్ష్యం.
Also Read : నెల్లూరు జిల్లాలో న్యూడ్ వీడియో కాల్స్ కలకలం..
తగ్గుతున్న ప్రమాదాలు.. కానీ జరుగుతున్నవి తీవ్రమైనవి..!
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రమాదాలు ఎక్కువగా ఉండేవి. పట్టపగలు మద్యం తాగి రమ్య అనే చిన్నారి మరణానికి కారణమైన ఘటన తర్వాత పోలీసులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2017లో 2367ప్రమాదాల కేసులు నమోదు కాగా.. 2018 లో వాటి సంఖ్య అత్యధికంగా 2540గా నమోదయింది. 2019లో కూడా దాదాపుగా అంతే సంఖ్యలో అంటే 2493 ప్రమాదాలు నమోదయ్యాయి. ఆ తర్వాత పోలీసులు గట్టిచర్యలు తీసుకున్నారు. డ్రంకన్ డ్రైవ్‌ల సంఖ్య అనూహ్యంగా పెంచారు. కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. దాంతో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 1843 యాక్సిడెంట్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది డిసెంబర్ వరకూ వాటి సంఖ్య 1657 మాత్రమే. ప్రమాదాల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. నమోదవుతున్న ప్రమాదాల కేసుల్లో అత్యధికం వాహన దారుల నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్నవే కావడంతో పోలీసులకు కూడా వీటిని నిలుపుదల చేయడం సవాల్‌గా మారింది.
Also Read: Mi 17V Helicopter : వరల్డ్ బెస్ట్ హెలికాఫ్టర్లలో ఒకటి Mi-17V-5 ..! మరి ప్రమాదం ఎలా జరిగింది ?
చంపేస్తున్న ఓవర్ స్పీడింగ్ !
ఓవర్ స్పీడింగ్ కారణంగా నమోదవుతున్న ప్రమాదాలే ఎక్కువ. పోలీసులు ఇలాంటి వారిని కట్టడి చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. 237 మంది చనిపోవడానికి కారణమైన ప్రమాదాలను విశ్లేషిస్తే అత్యధికంగా అంటే 178 మరణాలు ఓవర్ స్పీడింగ్ వల్లనే చోటు చేసుకున్నాయి. మద్యం తాగి వాహనం నడపడం వల్ల 13, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 10, మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల 6, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్ల మరో 24 మరణాలు చోటు చేసుకున్నాయి. అంటే.. వేగాన్ని నియంత్రించుకుంటే ప్రాణాలు కూడా నిలబడతాయని సులువుగానే అంచనా వేయవచ్చు.
25 కిలోమీటర్లకు చేరిన వాహనదారుడి సగటు వేగం !
ప్రమాదానికి కారణవుతున్న వాహనాలు ఎక్కువగా సరకు రవాణా వాహనాలే. నమోదైన భారీ ప్రమాదాల రికార్డులను బట్టి చూస్తే మొత్తం 95 భారీ యాక్సిడెంట్లు హైదరాబాద్‌లో ఈ ఏడాది జరిగితే అందులో 43 సరుకు రవాణా వాహనాలే ఉన్నాయి. కార్లు, క్యాబ్స్ వల్ల మరో 14, ద్విచక్ర వాహనాల వల్ల 24 భారీ ప్రమాదాలు జరిగాయి. అయితే ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే వాహనదారులు ఎప్పటికప్పుడు తమ స్పీడింగ్ పెంచుకుంటూనే పోతున్నారు. 2016లో వాహనదారుల సగటు వేగం 19 కిలోమీటర్లు ఉండగా.. అది 2021కి ఏకంగా 25 కిలోమీటర్లకు చేరింది. రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు పెరగడం.. అత్యాధునిక బైకులు, వాహనాలు వస్తూండటమే దీనికి కారణం. ప్రమాదాలు పెరగడానికి ఇది కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా మారని పరిస్థితులు !
పోలీసులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గీత దాటితే చలానా పడుతుందనే భయాన్ని కల్పిస్తున్నారు. ఈ ఏడాది తొలి 11 నెలల్లో 39 లక్షల మందికి హెల్మెట్ పెట్టుకోనందుకే ఫైన్ వేశారు. ఇక ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కింద, సిగ్నల్ జపింగ్ కింద.. వేల మందికి ఫైన్లు వేశారు. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఘటనల్లో ఏకంగా 21041 కేసులు నమోదు చేశారు.
Also Read: CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!
ప్రమాదాలు నివారించే బాధ్యత పోలీసులదే కాదు.. పౌరులది కూడా !
మొత్తంగా చూస్తే ప్రమాదాల సంఖ్య తగ్గుతోంది కానీ.. జరుగుతున్న ప్రమాదల తీవ్రత మాత్రం పెరుగుతోంది. ఈ కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాదల నివారణ.. కట్టడి బాధ్యత పోలీసులది మాత్రమే కాదు. ప్రతి ఒక్కరిది. రోడ్డెక్కిన తర్వాత ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటే ఈ ప్రమాదాలు అతి తక్కువ అవుతాయి. అలాంటి బాధ్యత అందరూ గుర్తించినప్పుడే... ఎన్నో ప్రాణాలునిలబడతాయి.
Also Read: Chief of Defence Staff: ఏంటీ సీడీఎస్.. కార్గిల్ యుద్ధ కాలంలోనే ఈ పదవిపై చర్చలు జరిగాయా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి