Kavitha : ఐదు రోజులైనా ఉలుకూ పలుకూ లేదు! కవితపై చర్యలు తీసుకుంటారా? కూతురని వదిలేస్తారా? అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం!
Kavitha : బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖ లీకై ఐదు రోజులు గడించింది. నేటికీ ఎలాంటి చర్యలు లేవు. ఆమె లేవనెత్తిన అంశాలపై యాక్షన్ లేదు.ఇంతకీ కేసీఆర్ వ్యూహమేంటి.?

Kavitha : తెలంగాణ రాష్ట్రసమితి పుట్టకకు కారణమై, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో అన్నీ తానై కీలకపాత్ర పోషించారు కేసీఆర్. అటువంటిి అలుపెరుగని రాజకీయ శిఖరానికి కూతురు పేరుతో గండం ముంచుకొచ్చింది. గతంలో ఎన్నడూ ఎదురు కాని ప్రశ్న ఎదురైంది. సమాధానం చెప్పినా, మౌనంగా ఉన్నా ఏం చేసినా నష్టం మాత్రం తప్పదు. ఇప్పుడున్న పరిస్దితిలో ఏం చేయాలి, కూతురిపై చర్యలు తీసుకోవాలా, లేక లైట్ తీసుకుని ముందుకు సాగాలా అనే సందిగ్ధత కేసీఆర్ వెంటాడుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఈనెల 2వ తేది ప్రియమైన డాడీ అంటూ మొదలుపెట్టి, బిజెపితో పొత్తుపెట్టుకుంటున్నారనే భావన కలుగుతోంది అని అసమ్మతి స్వరంతో కేసీఆర్‌కు కవిత లేఖ రాస్తే, ఐదు రోజుల క్రితం 22వ తేదీన లేఖ ఫామ్ హౌస్ గోడదూకి , మీడియాకు చిక్కింది. అలా చిక్కిన లేఖపై అనేక కథనాలు,విమర్శలు నేటీకి షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నా బిఆర్‌ఎస్‌లో మాత్రం సునామీ ముందు నిశ్శబ్ధం కనిపిస్తోంది. కవిత లేఖపై ఇటీవల తన ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాత్రమే స్పందించారు. అది కూడా కర్ర విరగకుండా, పాము చావకుండా అనేలా ఏదైనా ఉంటే పార్టీలో చర్చించాలి, ఇలా బహిరంగంగా మాట్లడం సరికాదన్నారు. అంతే ఖతం. అది మొదలు ఒక్కరంటే ఒక్కరు కూడా కవిత లేఖపై నోరుమెదపలేదు. బీఆర్‌ఆర్ నేతలు అంత సహాసం ఎలా చేస్తారనే సందేహం రావొచ్చు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ సైతం ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్నారు.
కవిత లేఖ రాస్తే తప్పేముంది. ఆమె కూడా బిఆర్‌ఎస్‌లో ఓ కీలకనేతే కదా అని అంతా అనుకున్నారు. కానీ శంషాబాద్ ఎయిర్ పోర్టు సాక్షిగా ఆమె చేసిన విమర్శలే పార్టీని షేక్ చేశాయి. వివాదాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయి. తండ్రి దేవుడే, ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి.. అనే మాట మొత్తం పొలిటికల్ సీన్ మార్చేసింది. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు కవితపై, షోకాజ్ నోటీసులు ఇస్తారని అంతా అనుకున్నారు. పార్టీ లైన్ దాటింది. బహిరంగంగా పార్టీలో నేతలను విమర్శించింది. ఒక్కమాటలో చెప్పాలంటే తన తండ్రి పార్టీ నడుపుతున్న తీరునే వేెలెత్తి చూపించింది. కాంగ్రెస్ నేతలైతే ఆయన దెయ్యాల నాయకుడంటూ కేసీఆర్ పై విమర్శలతో రెచ్చిపోతున్నారు.
ఇప్పుడేంచేయాలి.. కవితపై ఎలా ముందుకెళ్లాలి.. షోకాజ్ ఇచ్చి వదిలించుకోవాలి.. వదిలేసి సర్దుకుపోవాలా.. ఒకవేళ మనం సర్దుకుపోయినా ..కవిత ఇక్కడితో వదిలేస్తారా. మరోసారి పార్టీపై ఇంతే స్థాయిలో విమర్శులు చేస్తే, ఉన్న పరువు కాస్తా పోతుందిగా.. ఇలా అనేక ప్రశ్నలు బిఆర్‌ఎస్ కీలక నేతలను వెంటాడుతున్నాయి. ఈ వ్యవహారంపై గులాబీ బాస్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే ఆసక్తి సొంత పార్టీలో పీక్స్ చేరింది. బీఆర్‌ఎస్‌లో అందరూ యజమానులే అంటూ బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఈటెల చేసిన కామెంట్స్, కేసీఆర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఈటెలను పార్టీ నుంచి నిర్దాక్ష్యణ్యంగా గెంటేశారు. పార్టీ లైన్ దాటి బహిరంగ విమర్శలు చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. మరి కవిత కూాడా ఈటెల మాదిరే పార్టీలో లోపాలను ఎత్తిచూపారు. పార్టీలో దెయ్యాలు ఉన్నాయంటూ మీడిాయా ముందే విమర్శించారు. ఐదు రోజులు గడుస్తున్నా, నేటికీ కవితకు షోకాజ్ ఊసేలేదు, కవితను పిలిపించి కూడా లేఖలోని అంశాలపై మాట్లడిన దాఖలాలు లేవు.
పార్టీలో ఇలాంటి పరిస్దితులు వచ్చినప్పుడు తాాజాగా లాలూ నుంచి గతంలో కరుణానిధి వరకూ అందరూ ఓ నిర్ణయానికి వచ్చారు. సొంత బిడ్డలనైనా దూరం పెట్టేశారు. అదే బాటలో కేసీఆర్ సైతం కవితపై చర్యలకు సిద్దమవుతారా, లేక కూతురు కోటాలో క్షమించి వదిలేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా కేసీఆర్ కు కూతురు పేరుతో రాజకీయ అగ్నిపరీక్ష ఎదురైంది. దీన్ని ఎలా అదిగమిస్తారొో చూడాలి. ఇదిలా ఉంటే కవిత మాత్రం పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా, తాను సిద్దం అన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా నియోజకవర్గాల వారికీ తెలంగాణ జాగృతి కమిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కవిత దూకుడు చూస్తుంటే వేటు పడితే, వేరు పార్టీనే అనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.





















