Kavitha: కవిత ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరం-పార్టీతో పెరిగిన అంతరానికి ఇది నిదర్శనమా?
Kavitha: కవిత బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని చేస్తోన్న విమర్శల నేపథ్యంలో ఆమె చేస్తున్న కార్యక్రమాలకు పార్టీ దూరంగా ఉంటోంది.

Kavitha: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ పార్టీలో ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత తప్ప గులాబీ నేతలు ఎవరూ హాజరుకాలేదు. గత కొద్ది రోజులుగా కవిత బీఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని చేస్తోన్న విమర్శల నేపథ్యంలో ధర్నా కవితను పార్టీ దూరం పెడుతోందన్న సంకేతాలను ఇస్తోందని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీలో అంతర్గత విభేదాల వల్లే గైర్హాజరయ్యారా?
గతంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం నిర్వహించినా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనేవి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 'కవితక్కా' అంటూ వాలిపోయేవారు. కొన్నిసార్లు పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉదంతాలు ఉన్నాయి. అయితే కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా జరిగినా, ఏ ఒక్క గులాబీ నేత ఇటు పక్క తొంగిచూడని పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలపై కవిత చేస్తోన్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై పార్టీ చీఫ్ కేసీఆర్ నుంచి ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. పొరపాటున ఈ ధర్నాలో పాల్గొంటే ఎమ్మెల్సీ కవిత చేస్తోన్న విమర్శలకు తాము మద్దతు పలుకుతున్నామన్న సంకేతాలు పార్టీ అధిష్ఠానానికి వెళతాయన్న భయంతో అందరూ దూరం పెడుతున్నట్లు అర్థం అవుతోంది. అదే రీతిలో బీఆర్ఎస్ నేతలకు, శ్రేణులకు కూడా కవిత హాజరు కావాలని పిలుపును ఇవ్వకపోవడం గమనార్హం.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉన్న కవిత
తెలంగాణ ఆవిర్భావంలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పాత్ర అత్యంత కీలకం. అందులోనూ ఆ పార్టీ నేతగా కవిత ఉద్యమం కొట్టిపారేయలేనిది. అలాంటిది జూన్ 2వ తేదీన జరిగిన తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొనలేదు . అంతే కాదు, పార్టీ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం కూడా గమనించాల్సిన విషయం. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కవిత తన కొత్త పార్టీ కార్యాలయంలోనే జరుపుకోవడం విశేషం. ఇది చూస్తుంటే, పార్టీ కవితను ప్రస్తుతం పక్కన పెట్టినట్లు అర్థం అవుతుంది. అలాగే, కవిత సైతం పార్టీ కార్యక్రమాలకు సంబంధం లేకుండా జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇది చూస్తుంటే, పార్టీకి, కవితకు మధ్య చాలా దూరం పెరిగినట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం కమిషన్ పై కవితది ఓ రూటు, గులాబీ పార్టీదో రూటు
కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ చీఫ్‌ను విచారణ జరపడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్రంగా ఖండిస్తోంది. అయితే, కమిషన్ ఎదుట హాజరుకావడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని బయటకు చెప్పడం, అదే రీతిలో కమిషన్ ఎదుట హాజరు కాకపోతే తాను తప్పు చేసినట్లు ప్రజల్లో తప్పుడు సంకేతం వెళుతుందన్న ఆలోచనతో కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అవసరమైన సమయాన్ని కూడా ఇవ్వాలని కమిషన్‌కు లేఖ రాసి, తాను హాజరు అవ్వాల్సిన తేదీని కూడా మార్చుకున్నారు. కానీ, కవిత మాత్రం అసలు కమిషన్ నోటీసులు ఇవ్వడం తప్పు అన్న రీతిలో ధర్నా నిర్వహించడం, కాంగ్రెస్ తప్పు చేసిందని చెప్పడం అటు కేసీఆర్ ఆలోచనా వైఖరికి, కవిత ఆలోచనా వైఖరికి కొంత తేడా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా, కీలక నేతగా కవిత ఉన్నారు. కానీ, పార్టీలో రెండు భిన్న వైఖరులున్నాయన్న దానికి కవిత జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా ఓ నిదర్శనంగా చెప్పవచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
కవిత వ్యవహార శైలి బీఆర్ఎస్ భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం
ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉండటం, కవిత తన సొంత ఆలోచనతో ఈ ధర్నా జరపడం రానున్న రోజుల్లో ఇది బీఆర్ఎస్ లో అంతర్గతంగా చాలా మార్పులకు తావిచ్చేదిగా ఉంది. పార్టీ కవిత విషయంలో ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకునేలా ప్రేరేపించేదిగా కవిత కార్యాచరణ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, కవిత చాలా దూకుడుగా రాజకీయాలు చేస్తోందని చెబుతున్నారు. అయితే, దీనిపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పుడు సర్వత్రా సాగుతోంది. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తారా, లేక ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ సామరస్యంగా పరిష్కరిస్తే, రానున్న రోజుల్లో ఇతర నేతలు కూడా ఇలా వ్యవహరిస్తే పార్టీ నిర్ణయాలు ఎలా ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా, ధర్నా కవిత భవిష్యత్తు రాజకీయానికి ఓ తలుపు తెరిచిందన్న వ్యాఖ్యలురాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తున్నాయి.






















