Kavitha Letter to Revanth Reddy: తక్షణం ఆ టెండర్లు రద్దు చేయండి, లేకపోతే ప్రజాధనం దుర్వినియోగం: రేవంత్ రెడ్డికి కవిత లేఖ
Telangana News | జీహెచ్ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్ మీద ఏడాదికే 5 కోట్లకు పైగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

హైదరాబాద్: వర్షాకాలం మొదలవడంతో తెలంగాణ ప్రభుత్వం అందుకు సంబంధించి ఏర్పాట్ల కోసం పిలిచిన టెండర్లపై వివాదం మొదలైంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లు నష్టపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. జీహెచ్ఎంసీలో మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ (Monsoon Emergency Teams), ఇన్ స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కొన్ని నిబంధనల కారణంగా తెలంగాణకు చెందిన డీలర్లకు నష్టం కలగడంతో పాటు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
గతంలో 5 నెలలకు టెండర్లు, ఇప్పుడు 3 ఏళ్లకు ఒకేసారి..
జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో వర్షాకాల ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రీపేర్ టీమ్స్‌కు సంబంధించిన పనులకు గతంలో 5 నెలల కోసం టెండర్లు పిలిచేవారు. కానీ ఈసారి 3 ఏళ్ల కాలానికి టెండర్లు పిలిచారు. కానీ పనులు చేపట్టడానికి ఉపయోగించే వాహనాలకు కొన్ని స్పెసిఫికేషన్లు ఉండాలని రూల్స్ పెట్టారు. ఆ స్పెసిఫికేషన్లు ఉన్న ఉన్న వాహనాలు విక్రయించే డీలర్లు హైదరాబాద్ లో ఇద్దరే ఉన్నారు. దాంతో స్థానిక కాంట్రాక్టర్లకు ఆయా డీలర్లు వాహనాలు సరఫరా చేయడానికి అనుమతి ఇవ్వకపోవడంతో కర్ణాటక నుంచి ఎన్‌వోసీ తీసుకుని మరీ టెండర్లలో పాల్గొన్నారు. ఆ కాంట్రాక్టర్లకు సంబంధిత పత్రాలు సమర్పించడానికి జీహెచ్ఎంసీ అధికారులు టైమ్ ఇవ్వడం లేదు.
స్థానిక టెండర్లను డిస్ క్వాలిఫై చేసే ప్రయత్నం..
దాంతో టెండర్లలో వారిని డిస్ క్వాలిఫై చేసి ముందుగానే ఒప్పందం చేసుకున్న 2 సంస్థలకు లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆ పనుల కోసం గతంలో వినియోగించిన వాహనాలు 2, 3 క్యూబిక్ మీటర్ల మేటీరియల్ తరలించే వీలుంది. ప్రస్తుతం టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్న స్పెసిఫికేషన్లు ఒక విదేశీ కంపెనీ వెహికల్స్ కు మాత్రమే ఉంది. అయితే ఆ వాహనాల ద్వారా క్యూబిక్ మీటర్ మెటీరియల్ సైతం తరలించడం సాధ్యం కాదని కథనాలు వస్తున్నాయి. అదే కారణంతో ఒక్క ఏడాదికే గతంలో అయ్యే ఖర్చు కంటే రూ.5.40 కోట్లు అధికంగా ఖర్చు అయ్యి మొత్తం ఖర్చు రూ.11.25 కోట్లకు చేరింది. ప్రజాధనం రూ.5.85 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని.. మున్సిపల్ శాఖ మీరే నిర్వహిస్తున్నారు కనుక మీ శాఖ పరిధిలోని జీహెచ్ఎంసీ టెంటర్లలో తెలంగాణ కాంట్రాక్టర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగా మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్ టెండర్లను రద్దు చేయాలి.
వార్డుల వారీగా టెండర్లు పిలవాలని కోరిన కవిత
గతంలో చేసినట్లుగానే వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది కాంట్రాక్టర్లకు ఉపాధి ఉంటుంది. కానీ జోన్ల వారీగా టెండర్లకు పిలిస్తే కవేలం 9 మంది మాత్రమే టెండర్లు రాగా, వాటిని తమకు అనుకూలమైన సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది. ప్రజాధనం సైతం దుర్వినయోగం కాకుండా చూడాలంటే వెంటనే ఆ టెండర్లను రద్దు చేసి, వార్డుల వారీగా టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కవిత డిమాండ్ చేశారు.






















