Telangana Formation Day: రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ, మరియు మిస్ వరల్డ్ 2025 విజేత థాయ్ లాండ్ భామ ఓపల్ సుచాతా ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.

రేపే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: ఘనంగా వేడుకలు నిర్వహిస్తోన్న ప్రభుత్వం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, జూన్ 2వ తేదీ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున పలు కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతకుముందు, ఆయన గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. ఇదే వేదిక నుండి ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ ఏర్పాటు, అభివృద్ధి జరిగిన తీరును ప్రజలకు వివరిస్తారు.
తమ ప్రభుత్వం ఏయే కార్యక్రమాలు చేపట్టిందో, వాటి ఫలితాలను ప్రకటిస్తారు. విశిష్ట సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు ఇదే వేదిక మీద సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇదే వేదిక నుండి 'రాజీవ్ యువ వికాసం' పథకం తొలి దశను ప్రభుత్వం ప్రారంభించనుంది. స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, రాయితీ రుణాలు ఇప్పించడమే ఈ పథకం ముఖ్యోద్దేశం.
సుమారు లక్ష మంది అర్హులైన లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలను ఈ పథకం కింద సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా "జయ జయహే తెలంగాణ" అనే రాష్ట్ర గీతాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ గీతాన్ని ప్రముఖ గీత రచయిత అందెశ్రీ రచించారు.
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయా జిల్లాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించే ముఖ్యులు:
ఆదిలాబాద్-ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
భద్రాద్రి కొత్తగూడెం-మంత్రి తుమ్మల
హన్మకొండ-కొండా సురేఖ
జగిత్యాల-ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
జయశంకర్ భూపాలపల్లి-తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పొదెం వీరయ్య
జోగులాంబ గద్వాల-ప్రభుత్వ సలహాదారు ఏపీ జితెందర్ రెడ్డి
కామారెడ్డి-తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
కరీంనగర్-మంత్రి శ్రీధర్ బాబు
ఖమ్మం-ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
కొమరం భీం ఆసిఫాబాద్-శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్
మహబూబాబాద్-ప్రభుత్వ విప్ రామచందర్ నాయక్
మహబూబ్ నగర్-మంత్రి జూపల్లి కృష్ణారావు
మంచిర్యాల-ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ రావు
మెదక్-ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు
మేడ్చెల్-శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
ములుగు-మంత్రి సీతక్క
నాగర్ కర్నూల్-ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి
నల్గొండ-మంత్రి కోమటిరెడ్డి
నారాయణపేట-తెలంగాణ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ గుర్నాథ్ రెడ్డి
నిర్మల్-తెలంగాణ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య
నిజామాబాద్-తెలంగాణ మినరల్ కార్పోరేషన్ ఛైర్మన్ ఇ. అనిల్
పెద్దపల్లి-తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నేరేళ్ల శారద
రాజన్న సిరిసిల్ల-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంగారెడ్డి-సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి
సంగారెడ్డి-మంత్రి దామోదర రాజనర్సింహా
సిద్దిపేట-మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్యపేట-మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
వికారాబాద్-శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వనపర్తి-తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటీవ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్ పర్సన్ ప్రీతమ్
వరంగల్-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
యాదాద్రి భువనగిరి-శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జూన్ 2వ తేదీ ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు హైదరాబాద్ లోని గన్ పార్కు, పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి సహా, ఇతర ముఖ్య వీఐపీలు ఈ ప్రాంతం గుండా ప్రయాణించనుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టడం జరిగింది.
ముఖ్య అతిథులుగా జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్, మిస్ వరల్డ్ 2025 విజేత
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ, మరియు మిస్ వరల్డ్ 2025 విజేత థాయ్ లాండ్ భామ ఓపల్ సుచాతా ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అనంతరం, ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ ప్రభుత్వం, కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీల మధ్య పరస్పర సహకార ఒప్పందాలు జరగనున్నాయి. జపాన్ లో ఒకప్పుడు కితాక్యూషూ సిటీ అత్యంత కాలుష్యంతో నిండిన ప్రాంతంగా ఉండేది. ఆ నగరంలో గాలి, నీరు, నేల విషపూరితంగా మారిన పరిస్థితులుండేవి. ఈ నగరం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఈ నగరాన్ని సందర్శించి, సిటీ మేయర్ ను తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే మేయర్ కజుహిసా టకేచీ ఈ వేడుకలకు హాజరవుతున్నారు.






















