Kishan Reddy on BJP Tickets: ఆ అభ్యర్థుల అప్లికేషన్స్ రిజెక్ట్ చేస్తాం - తొలిరోజే బీజేపీ నేతలకు కిషన్ రెడ్డి వార్నింగ్!
Kishan Reddy warns BJP Leaders Over Tickets: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెళ్లి నియోజకవర్గంలో పని చేసుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సూచించారు.
Kishan Reddy warns BJP Leaders over Tickets:
తెలంగాణలో ఎన్నికల వేడి మరింత పెరుగుతోంది. ఇదివరకే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి 115 అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. వెయ్యికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కేంద్రంలోనే కాదు రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చేది తామే అంటూ చెబుతున్న పార్టీ బీజేపీ. కమలం పార్టీ సైతం నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు కోరింది.
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇందు కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 4) నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు ఆశావహ అభ్యర్థుల నుంచి ఎన్నికల్లో సీటు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. పార్టీ చరిత్రలోనే బీజేపీ పార్టీలో తొలిసారి అభ్యర్థుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని అడ్డుకుని, తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయాలని కమలనాథులు యోచిస్తున్నారు.
అలా చేస్తే అభ్యర్థుల అప్లికేషన్స్ రిజెక్ట్ - కిషన్ రెడ్డి వార్నింగ్
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెళ్లి నియోజకవర్గంలో పని చేసుకోవాలని సూచించారు. అలా కాదని దరఖాస్తు చేసుకొని ఎవరైనా అభ్యర్థులు మీడియాతో మాట్లాడితే వారి అప్లికేషన్స్ పక్కన పెట్టాలని ఆదేశించారు. ఎన్నికల్లో బీజేపీ విజయంపై ఫోకస్ చేయాలని, అభ్యర్థుల ఎంపికను అధిష్టానం చూసుకుంటుందన్నారు. పార్టీ గెలుపు కోసం ఆలోచించాలని, ఇతర విషయాలను పట్టించుకోకూడదని దరఖాస్తు చేసుకునే నేతలకు కిషన్ రెడ్డి సూచించారు.
క్రిమినల్ కేసులు సహా మొత్తం వివరాలతో దరఖాస్తు
బీజేపీ టికెట్ ఆశించే నేతలు ప్రస్తుతం పార్టీలో ఏదైనా పదవిలో కొనసాగుతున్నారో తెలపాలి. వారి వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్ల సమాచారం కూడా అప్లికేషన్ లో నింపాలి. దరఖాస్తు ప్రత్యేక ఫారంను మొత్తం 4 విభాగాలుగా రూపొందించారు. తొలి విభాగంలో నాయకుల బయోడేటా, వారి రాజకీయ కార్యక్రమాలను వెల్లడించాలి. ఇక రెండో విభాగంలో గతంలో ఎన్నికల్లో పోటీ చేశారా, చేస్తే ఫలితాల వివరాలను తెలపాలి. మూడో విభాగంలో ప్రస్తుతం పార్టీలో నిర్వహిస్తున్న బాధ్యతల వివరాలు అందించాలి. చివరిదైన నాలుగో విభాగంలో నాయకులపై నమోదైన క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు, జైలుకు వెళ్లినా, ఏదైనా శిక్ష ఎదుర్కున్నా ఆ కేసులు వివరంగా పొందుపరచాలని సూచించారు.
మూడు దశల్లో వడపోత- తర్వాత టిక్కెట్
టిక్కెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా, రాష్ట్ర, కేంద్ర పార్టీ స్థాయిలో మూడు దశలో వడపోత చేపట్టనున్నారు. నియోజకవర్గాలవారీగా వచ్చిన అప్లికేషన్లను రాష్ర్ట నేతలు పరిశీలిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సీనియర్ నేతలతో కమిటీ ఉంటుంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లను ఫైనల్ చేసి హైకమాండ్ కు పంపించనున్నారని తెలుస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి పోటీ అధికంగా ఉంటుందని నేతలు భావిస్తున్నారు.