Damagundam Radar Center Foundation: దామగుండంలో రాడార్ కేంద్రానికి రాజ్‌నాథ్‌సింగ్ శంకుస్థాపన- విద్యాసంస్థల్లో 1/3వ వంతు సీట్లు కేటాయింపునకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
Viakarabad News: దామగుండంలో ఏర్పాటు చేయనున్న రాడార్ కేంద్రానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. 2027 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Radar Center In Damagundam : వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న రాడార్ కేంద్రానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేంద్రాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్రం ప్లాన్ రెడీ చేసింది.
కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో శంకుస్థాపన జరిగింది. వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుకు ఎప్పుడో కేంద్రం ఓకే చెప్పింది. ఇన్ని రోజులకు ఇవాళ భూమిపూజ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల 55 నిముషాలకు భూమిపూజ జరిగింది. దేశంలోనే అతిపెద్ద రెండో వీఎల్‌ఎఫ్ నేవీ రాడార్ సెంటర్‌గా దీన్ని 2027 నాటికి పూర్తి చేయాలని సంకల్పించింది కేంద్రం.
దీని నిర్మాణానికి 2,900 ఎకరాల అటవీ భూమిని ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ భూమి అప్పగింతతో ఇక్కడ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు మార్గం సులభమైంది. ఈ రాడార్‌లో సదుపాయాలు కల్పించేందుకు ఈ అటవీ ప్రాంతం చుట్టూ దాదాపు 24 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు.
ఇప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రాడార్ స్టేషన్‌తోపాటు 2500 మంది నివాసం ఉండేలా టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. అందులో స్కూల్స్, హాస్పిటల్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ఇక్కడ దాదాపు 500 మందికిపైగా నేవీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది పని చేస్తారు.
రాడార్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన తర్వాత వికారాబాద్ పూడూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోందన్నారు. " దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్, ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందింది. కొందరు వీఎల్ఎఫ్‌ను వివాదం చేస్తున్నారు. వీఎల్ఎఫ్‌తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణం." అని అన్నారు.
"ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం.. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల మోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి. 2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. అని తెలియజేశారు.
"ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్ నాథ్ సింగ్ అడగ్గానే మేం కొనసాగించాం. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించా.. పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా... దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం... దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు.. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు... దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి. వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు.
రాడార్ ఏర్పాటు ప్రాంతంలో గుడికి వచ్చేందుకు ప్రజలకు అనుమతి ఇవ్వాలి రాజ్‌నాథ్‌కు విజ్ఞప్తి చేశారు. " ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతున్నా.. ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరుతున్నా.. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని రేవంత్ రెడ్డి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.