చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం
తమిళనాడులో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని IMD వెల్లడించింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. చెన్నైకి రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం కలుగుతోంది. కోయంబేడు, పెరుంగుడి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షాల కారణంగా స్కూల్స్, కాలేజ్‌లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డిప్యుటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కమాండ్ సెంటర్‌ని పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బంగాళాఖాతానికి దక్షిణ దిక్కున తీవ్ర అల్పపీడనం ఏర్పడిన కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నట్టు IMD స్పష్టం చేసింది. ఈ ప్రభావం నార్త్ తమిళనాడుతో పాటు, పుదుచ్చేరి,ఏపీపై ఉంటుందని వెల్లడించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అత్యవసర పరిస్థితులు వస్తే ఎలా స్పందించాలన్నది చర్చించారు. అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.