Fact Check: మంత్రి బొత్సకు TSSPDCL అదిరిపోయే కౌంటర్! కరెంట్ బిల్లు నిజంగా కట్టలేదా? ఇందులో నిజమెంత?
Botsa Satyanarayana: బొత్స చేసిన ఈ కౌంటర్‌కు దీటుగా TSSPDCL ఝలక్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. TSSPDCL పేరుతో ఉన్న ఓ ట్విటర్ ఖాతాలో ఏప్రిల్ 30న ఓ ట్వీట్ కూడా చేసి ఉంది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌లోని తన ఇంట్లో నిజంగా కరెంటు బిల్లు కట్టలేదా? ఆయన గత 15 నెలలుగా కరెంటు బిల్లు కట్టలేదని అందుకే ఆయన ఇంటికి విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రకటించినట్లుగా సామాజిక మాధ్యమాలు సహా ప్రధాన మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. మొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీలోని మౌలిక సదుపాయాల లేమిపై చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. హైదరాబాద్‌లోనే కరెంటు లేదని తాను జనరేటర్ వేసుకోవాల్సి వచ్చిందని బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.
బొత్స చేసిన ఈ కౌంటర్‌కు దీటుగా TSSPDCL ఝలక్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. TSSPDCL పేరుతో ఉన్న ఓ ట్విటర్ ఖాతాలో ఏప్రిల్ 30న ఓ ట్వీట్ కూడా చేసి ఉంది. ‘‘ప్రియ వినియోగదారులు బొత్స సత్యనారాయణ గారూ, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీ ఇంటిపై పెండింగ్‌లో ఉన్న కరెంటు బిల్లులను కట్టేస్తే వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తాం. మీరు కరెంటు బిల్లు 15 నెలల నుంచి కట్టడం లేదు.’’ అని TSSPDCL అనే ట్విటర్ అకౌంట్‌లో ట్వీట్ ఉంది.
ఆ ఫేక్ ట్వీట్ ఇదీ..
Dear consumer, @BotchaBSN
— TSSPDCL (@isocialsaint) April 30, 2022
We regret for the inconvenience caused. We will immediately supply current to your house once you clear the current bill. It's been 15 months that you're not paying the current bill. https://t.co/5jV0pOZk4F
ఇది ఎంత వరకూ నిజం?
బొత్స సత్యనారాయణ కరెంటు బిల్లు కట్టలేదని ట్వీట్ చేసి ఉన్న ట్విటర్ అకౌంట్ TSSPDCL పేరుపైనే ఉన్నా.. దాన్ని @isocialsaint నిర్వహిస్తోంది. కానీ, TSSPDCL అధికారికంగా నిర్వహిస్తున్న ఖాతా మరొకటి ఉంది. దీన్ని @TsspdclCorporat నిర్వహిస్తోంది. ఇందులో ఏరోజు ఎక్కడెక్కడ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉంటాయో తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. బొత్స సత్యనారాయణపై చేసిన ఎలాంటి ట్వీట్లు ఇందులో లేవు. అంతేకాక, ఈ అధికారిక ఖాతాను హైదరాబాద్ సిటీ పోలీస్, అసదుద్దీన్ ఒవైసీ, దర్శకుడు హరీశ్ శంకర్ సహా ఎంతో మంది ప్రముఖులు ఫాలో అవుతున్నారు. బొత్స సత్యనారాయణ కరెంటు బిల్లు కట్టలేదనే ట్వీట్ ఉన్న ట్విటర్ అకౌంట్‌ను మాత్రం ప్రముఖులు ఎవరూ ఫాలో అవ్వడం లేదు. కానీ, ఈ నకిలీ ఖాతాకు 27 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అధికారిక ఖాతాకు 37 వేల ఫాలోవర్లు ఉన్నారు.
బొత్స సత్యనారాయణకు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసిన ట్విటర్ అకౌంట్ అచ్చం అధికారిక ఖాతాలాగానే కనిపిస్తోంది. TSSPDCL అధికారిక లోగో ప్రోఫైల్ ఫోటోగా, కవర్ ఫోటో కూడా సేమ్ టు సేమ్ అధికారిక ఖాతాకు ఉన్నట్లే ఉండడంతో అందరూ ఇది అధికారిక ఖాతాగానే భ్రమ పడ్డారు.
TSSPDCL అధికారిక ట్వీట్ ఖాతా
Dear Consumers,
— TSSPDCL (@TsspdclCorporat) May 1, 2022
There is an interruption in supply to 11KV Dubey colony feeder area from 33/11KV Pappireddy nagar Sub Station. Supply will be restored soon.
దక్షిణ డిస్కం సీఎండీ రఘుమా రెడ్డి ప్రకటన
TSSPDCL బొత్స సత్యనారాయణపై ఇచ్చిన నకిలీ కౌంటర్‌పై సీఎండీ రఘుమారెడ్డి కూడా స్పందించారు. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని TSSPDCL తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. సంస్థ పేరు మీద ఇలాంటి అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేసేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 15 నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించని కారణంగా హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి విద్యుత్ సరఫరా ఆపిన విషయం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.