TSRTC: మేం బస్ టికెట్ రేట్లు పెంచాం, మీరూ పెంచండి - పొరుగు రాష్ట్రాల ఆర్టీసీలకు TSRTC లేఖలు
TSRTC తో పోల్చితే పొరుగు రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర సర్వీసుల టికెట్ ధరలు తక్కువ ఉండడంతో వాటివైపే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు.
TSRTC Bus Tickets: టీఎస్ఆర్టీసీ కొద్ది రోజుల క్రితం బస్సు టికెట్ రేట్లు పెంచిన ప్రభావం ఆ సంస్థపై వెంటనే పడింది. ఆర్టీసీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. రేటు తక్కువని పొరుగు రాష్ట్రాలకు ప్రయాణించేవారు టీఎస్ఆర్టీకి ప్రత్యామ్నాయంగా ఆయా రాష్ట్రాల బస్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్టీసీ టికెట్ ధరలు పెంచగానే ఈ పరిణామం మొదలైంది. ఫలితంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల విషయంలో ఆదాయం బాగా పడిపోయింది. డీజిల్ సెస్ పేరుతో, రౌండప్ చార్జీల పేరుతో ఇప్పుటికే పలుమార్లు టీఎస్‌ఆర్టీసీ ప్రయాణీకులపై భారం మోపింది. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
టీఎస్ఆర్టీసీతో పోల్చితే పొరుగు రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర సర్వీసుల టికెట్ ధరలు తక్కువ ఉండడంతో వాటివైపే ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ అప్రమత్తం అయింది. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్‌ఆర్టీసీ లేఖలు పంపింది. అంతర్‌రాష్ట్ర రవాణా సంస్థల అగ్రిమెంట్ ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే రూల్ ఉందని టీఎస్ఆర్టీసీ అధికారులు అందులో తెలిపారు.
అందులో భాగంగానే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రధానంగా ఏపీ నుంచి తెలంగాణకు జనం రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆ రాష్ట్ర బస్సులనే ప్రయాణికులు ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీకి కూడా లేఖ రాశారు. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ఛార్జీల పెంపుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Also Read: Telangana Thirumala :తెలంగాణలో ఈ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమల వెళ్లొచ్చినంత ఫలితం!
ఏపీ నుంచే ఎక్కువ సర్వీసులు
ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణకు భారీగానే ఉంటాయి. ఏపీకి దగ్గరగా ఉండే తెలంగాణ జిల్లాలకు, హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున ఏపీ బస్సులు నడుస్తాయి. ఈ రాష్ట్రాల మధ్య ప్రయాణికుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అయితే ఇటీవల తెలంగాణ ఆర్టీసీ సర్వీసు చార్జీలు పెరడంతో ప్రయాణికులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వివిధ ప్రాంతాల బస్సుల్లో ఏపీ బస్సులనే ప్రయాణికులు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో ఆ మార్గాల్లో ఏపీ ఆర్టీసీ ఆదాయం పెరుగుతుండగా, తెలంగాణ ఆదాయం బాగా పడిపోయింది.
Also Read: Prashant Kishor Survey: నిజంగా పీకే సర్వేలు లీకయ్యాయా ? సోషల్ మీడియాలో వైరల్ రిపోర్టుల్లో నిజమెంత !